LORD AS BADRI NARAYANA AT SKVST_ సూర్యప్రభ వాహనంపై బద్రీనారాయణుడి అలంకారంలో శ్రీ కల్యాణ శ్రీనివాసుడు
Srinivasa Mangapuram, 2 Mar. 19: On 7th day morning of Brahmotsavams of Sri Kalyana Venkateswara Swamy, Lord rode on Surya Prabha Vahanam in Badri Narayana alankaram.
As caparisoned elephants, bhajan mandalis, Kolata troupes formed his entourage; the lord blessed the devotees on the four-mada streets in the sultry Saturday morning. The Surya Prabha Vahanam signified the co-existence of all life beings with Sun god as fulcrum and Lords riding such a vehicle denoted his command on the universe.
Earlier the utsava deities were given holy Snapana Tirumanjanam in the morning and in the evening will be accorded Unjal seva before the colourful Chandra Prabha Vahanam at night.
On the Day 8 of the Brahmotsavams, grand Rathotsavam will be in the early hours of March 3, Sunday.
Temple DyEO Sri Dhananjeyulu, AEO Sri Lakshmaiah, Suptd Sri Muni Chengalrayulu, Temple Inspector Sri Anil and others took part.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
సూర్యప్రభ వాహనంపై బద్రీనారాయణుడి అలంకారంలో శ్రీ కల్యాణ శ్రీనివాసుడు
తిరుపతి,2019 మార్చి 02: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శనివారం ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై బద్రీనారాయణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వాహనసేవ ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం కల్యాణ సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ భక్తులను ఆరోగ్యవంతులను చేస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిస్తాడు. సూర్యుడు సకలరోగ నివారకుడు. ఆరోగ్యకారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, పండే పంటలు, ఓషధీపతి అయిన చంద్రుడు సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాయి. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే కల్యాణ సూర్యనారాయణుడిని దర్శించే భక్తులకు ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతానసంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
వాహన సేవ అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబరి నీళ్ళతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.
కాగా సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ ధనంజయులు, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ లక్ష్మయ్య, ప్రధాన కంకణబట్టార్ శ్రీబాలాజీ రంగాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మార్చి 3న రథోత్సవం
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన ఆదివారం రథోత్సవం వైభవంగా జరుగనుంది. ఉదయం 5.00 గంటలకు స్వామివారు రథారోహణం చేస్తారు. ఉదయం 7.15 నుండి 8.15 గంటల వరకు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.