TIRUPPAVAI IN THE PLACE OF SUPRABHATAM FROM DEC 17_ డిసెంబరు 17 నుండి జనవరి 14వతేదీ వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై
Tirumala, 10 Dec. 18: In view of the auspicious Dhanurmasam which is commencing from December 16 by 5.19pm, Suprabhatam will be replaced by Tiruppavai from January 17 onwards in Tirumala temple.
This will last up to January 14 in 2019. Sri Andal Pasura Parayanam will be rendered in front of Lord during this period.
KOIL ALWAR
Meanwhile in connection with Vaikuntha Ekadasi on December 18, Koil Alwar Tirumanjanam will be performed in Tirumala temple on December 11.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
డిసెంబరు 17 నుండి జనవరి 14వతేదీ వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై
తిరుమల, 2018 డిసెంబరు 10: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబరు 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆనాటి సాయంత్రం 5.19 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా ధనుర్మాస ఘడియలు 2019, జనవరి 14న ముగియనున్నాయి.
ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం…
పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
దైవ ప్రార్థనకు అనుకూలం…
తాను అన్ని మాసాల్లో ఉత్తమమైన మార్గశిర మాసం లాంటివాడినని శ్రీమహావిష్ణువు స్వయంగా చెప్పినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలు తప్ప ఇతర కార్యక్రమాలు సాధారణంగా చేయరు. పూర్తిగా దైవంపైనే శ్రద్ధ వహించి ప్రార్థించాలన్నదే ఇందులో అంతరార్థం.
ధనుర్మాస పూజ వెయ్యేళ్ల ఫలం…
కలియుగంలో శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీవేంకటేశ్వరుని ధనుర్మాసంలో ఒకరోజు పూజించినా వెయ్యేళ్ల పూజాఫలం దక్కుతుంది. పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ భక్తులు ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో ధనుర్మాస పూజలు చేస్తారు.
ఆండాళ్ తిరుప్పావై పారాయణం…
12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్(గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.
ధనుర్మాస వ్రతం …
శ్రీ గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి చూపారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే సుఖసంతోషాలు ఒనగూరుతాయని తెలియజేశారు. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించేందుకు మధ్యగల కాలాన్ని ధనుర్మాసం అంటారు. పాపకర్మలను నశింపచేసి మోక్షసాధనకోసం చేసే వ్రతాలు, పూజలు, ఇతర ధార్మిక కార్యక్రమాలకు ఈ మాసం అనువైనదిగా భావిస్తారు.
వైకుంఠ ఏకాదశి…
ఈ మాసంలోనే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలలో శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాలను తెరచి ఉంచుతారు. ఈ రెండు పర్వదినాలలో పరమ పవిత్రమైన వైకుంఠ ద్వారం ద్వారా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.