YOGA NARASIMHA BLESSES ON SIMHA VAHANAM _ సింహ వాహనంపై యోగనరసింహుడి అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి
TIRUPATI, 13 February 2023: The ongoing annual brahmotsavams witnessed the ferocious Simha Vahanam wherein Sri Kalyana Venkateswara as Yoga Narasimha blessed His devotees.
The Lion is the King of the Jungle and known for majesty. The Hindu epics also describe Simha as a synonym for ferociousness, Leadership, strength etc.Lord in Half Man Half Animal avatar blesses devotees.
JEO Sri Veerabrahmam, Special Gr. DyEO Smt Varalakshmi and other temple staff, devotees were also present.
సింహ వాహనంపై యోగనరసింహుడి అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి
తిరుపతి, 2023 ఫిబ్రవరి 13: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం ఉదయం 8 గంటలకు అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగనరసింహుడి అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు వృషభాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
సింహ వాహనం – ధైర్యసిద్ధి
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు చెబుతున్నారు.
రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు కటాక్షిస్తారు.
వాహన సేవలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గురుమూర్తి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులతో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయులు, కంకణ భట్టార్
శ్రీ బాలాజి రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.