ప్రతి నెల ఏదో ఒక జిల్లాలో శ్రీవారికళ్యాణం లేదా శ్రీవారి వైభవోత్సవాలు _- టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి   

నెల్లూరు 20 ఆగస్టు 2022;టీటీడీ ఆధ్వర్యంలో ప్రతినెల రాష్ట్రంలోని ఏదో ఒక జిల్లాలో శ్రీవారి కల్యాణం లేదా శ్రీవారి వైభోత్సవాలు నిర్వహిస్తామని టిటిడి చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి చెప్పారు. నెల్లూరులో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీనివాస వైభోత్సవాల ముగింపు అనంతరం శ్రీ సుబ్బారెడ్డి భక్తులనుదేశించి మాట్లాడారు . హిందూ ధర్మ ప్రచారంలో  భాగంగా టిటిడి దేశవ్యాప్తంగా అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆయన చెప్పారు.  తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 502 ఆలయాల నిర్మాణం పూర్తి చేశామన్నారు . రాబోయే రోజుల్లో మరో 1300 ఆలయాల నిర్మాణానికి ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు.
 
దేశవ్యాప్తంగా ప్రముఖ పట్టణాల్లో స్వామివారి ఆలయాలు నిర్మిస్తున్నామని అదే విధంగా శ్రీవారి కల్యాణోత్సవాలు వైభోత్సవాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నామని శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు.తిరుమలకు వచ్చే భక్తులందరూ స్వామివారికి జరిగే నిత్య వారోత్సవాలు తిలకించడం సాధ్యం కాదన్నారు వయోభారం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అనేకమంది స్వామివారిని ఎక్కువసార్లు చూసి తరించే అవకాశం ఉండదని ఆయన తెలిపారు అలాంటి భక్తులకు ఈ బాధ లేకుండా చేయడం కోసం తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే నిత్య,వార సేవలను భక్తులు దర్శించేందుకు వీలుగా టీటీడీ పలు ప్రాంతాల్లో శ్రీ వెంకటేశ్వర వైభవో త్సవాలను నిర్వహిస్తోందని శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు.
 
కరోనా కారణంగా రెండున్నర ఏళ్ళ విరమణ తర్వాత నెల్లూరు నగరం నుంచి ఈ ఉత్సవాలను పునః ప్రారంభించామన్నారు నెల్లూరు జిల్లా వాసులకు స్వామివారి సేవలు చూసి తరించే భాగ్యం కల్పించడానికి ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి దంపతులు ఈ కార్యక్రమం నిర్వహణకు ముందుకు రావడం సంతోషకరమన్నారు . ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ధర్మ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు రాబోయే రోజుల్లో శ్రీవారి వైభోత్సవాలను కళ్యాణోత్సవాలను దాతలు సహకారంతో అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో నిర్వహించేందుకు కృషి చేస్తామని శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి జరిగే సేవలను నెల్లూరు జిల్లా వాసులకు దగ్గరగా చూపించిన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులను ఆయన అభినందించారు 
 
టీటీడీ ఢిల్లీ  స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ శ్రీవారి వైభోత్సవాలను నిర్వహించే అవకాశం రావడం స్వామి వారు తమకి ఇచ్చిన అదృష్టంగా చెప్పారు . రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించి స్వామివారిని భక్తులకు దగ్గర చేసే శక్తి తమకు ఇవ్వాలని ఆమె ప్రార్థించారు ఈ కార్యక్రమానికి సహకరించిన టిటిడి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఈవో శ్రీ ధర్మారెడ్డి ఇతర అధికారుల బృందానికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు 
 
నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి  శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరులో శ్రీవారి వైభోత్సవాల నిర్వహణకు ముందుకొచ్చిన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులను అభినందించారు శ్రీ వేంకటేశ్వర స్వామి వారు నెల్లూరుకు తరలివచ్చి భక్తులను వైభవోత్సవాల ద్వారా కరుణించారని ఆయన చెప్పారు ఈ కార్యక్రమానికి  సహకరించిన టీటీడీ చైర్మన్ కు  కృతజ్ఞతలు తెలియజేశారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారి చే విడుదల చేయబడినది.