Procession of SIMHA VAHANAM _ సింహ వాహనంపై కల్యాణ వెంకన్న తేజస్సు

On the third day of the ongoing nine-day annual Brahmotsavam in Sri Kalyana Venkateswara Swamy Temple at Srinivasa Mangapuram near Tirupati, the processional deity of Lord Kalyana Venkateswara Swamy, mounted atop the `SIMHA VAHANAM’ in form of Yoga Narasimha Swamy, was taken out in a grand procession on Sunday morning. 
 
TTD EO Sri L.V.Subramanyam, Tirupati JEO Sri P Venkatrami Reddy, CV&SO Sri GVG Ashok Kumar, DyEO Smt. Reddamma, AEO Sri Lakshman Naik, VGO Sri Hanumanthu, Supdt Engineer Sri Sudhakar Rao, Exe Engineer Sri Nageswara Rao, temple staff and large number of devotees took part in the procession
 

సింహ వాహనంపై కల్యాణ వెంకన్న తేజస్సు

తిరుపతి, మార్చి 3, 2013: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం ఉదయం అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహంపై కూర్చొని ఊరేగుతారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతాలవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారి నిరూపిస్తున్నారు.
కాగా సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ముత్యాల నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళయే అనుకూలం. అందుకే కల్యాణ శ్రీనివాసునికి మూడో రోజు రాత్రి మొదటియామంలో ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్ని పెద్దలు నిర్ణయించారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. మాంసమయమైన ఈ శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణ చక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. ఇలా స్వామివారికి మిక్కిలి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు – రత్నాల వల్ల కలిగే వేడిమినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని  తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షఃస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్ణస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్నీ, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి.

ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఉదయం శ్రీమతి ఎన్‌.సుశీలమ్మ, శ్రీ విష్ణు లక్ష్మీ సహస్రనామ పారాయణం, శ్రీ రవీంద్రరెడ్డి పురాణ ప్రవచనం, తిరుపతికి చెందిన శ్రీమవతి విజయలక్ష్మి బృందం సంప్రదాయ భక్తి సంగీతం కార్యక్రమాలు జరిగాయి. మధ్యాహ్నం తిరుపతికి చెందిన శ్రీ ఆముదాల మురళి ధార్మికోపన్యాసం, నారాయణవనానికి చెందిన ఓ.రవి హరికథ వినిపించారు. సాయంత్రం తాడేపల్లికి చెందిన శ్రీ మాతా శివచైతన్య ఆధ్యాత్మికోపన్యాసం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ జి.నాగేశ్వరనాయుడు అన్నమయ్య విన్నపాలు సంగీత కచేరి నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం దంపతులు, తిరుపతి జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌, స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి రెడ్డెమ్మ, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ లక్ష్మణ్‌ నాయక్‌, తితిదే సూపరింటెండెంట్‌ ఇంజినీరు శ్రీ సుధాకరరావు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు శ్రీ నాగేశ్వరరావు, ఇతర అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
            
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.