ANKURARPANAM FOR PUSHPA YAGAM HELD _ శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ

Tirumala, 10 November 2021:The Ankurarpana fete for annual pushpayagam was held in tirumala on wednesday evening.

The pushpayagam will be held in kalyanotsava mandapam in the hill shrine on Thursday between 1 pm and 5 pm where the floral bath will be rendered to deities with tonnes of varieties of flowers.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారి ఆలయంలో పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

2021 న‌వంబర్ 10 ;తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో గురువారం జ‌రుగ‌నున్న పుష్ప‌యాగానికి బుధ‌వారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది.

ఈ సందర్భంగా ఉదయం శ్రీవారి ఆలయంలో మూలవిరాట్‌ ఎదురుగా ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించారు. అర్చకులకు విధుల కేటాయింపునే ఋత్విక్‌వరణం అంటారు. ఇందులో వైదిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగిస్తారు. సాక్షాత్తు శ్రీవారి ఆజ్ఞ మేరకు విధులు పొందినట్టు అర్చకులు భావిస్తారు.

రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ‌వారి సేనాధిప‌తి అయిన శ్రీ విష్వ‌క్సేనుల వారిని ఆల‌యం నుండి వ‌సంత మండ‌పానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్క‌డ మృత్సంగ్ర‌హ‌ణం, ఆస్థానం నిర్వ‌హించి తిరిగి శ్రీ‌వారి ఆల‌యానికి చేరుకున్నారు. రాత్రి 9 నుండి 10 గంట‌ల నడుమ ఆల‌యంలోని యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అంకురార్పణం కారణంగా సహస్రదీపాలంకార సేవను టిటిడి ర‌ద్దు చేసింది.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య అధికారులు పాల్గొన్నారు.

న‌వంబ‌రు 11న పుష్ప‌యాగం

శ్రీ‌వారి ఆల‌యంలో గురువారం పుష్పయాగం సంద‌ర్భంగా ఉద‌యం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ‌ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.

మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా వ‌ర్చువ‌ల్ ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత‌ బ్రహ్మోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.