ANKURARPANAM” HELD_ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

ANNUAL FETE FROM SEPTEMBER 27

 

Tirumala, 26 September 2022:  Ahead of Srivari Brahmotsavam TTD organised the Ankurarpanam fete on Monday night which included Senadhipati utsava and other Yagashala rituals.

 

Significance

 

The sprouting of seeds – Ankuraropana otherwise known as Ankurarpana is a significant phase in Vaikanasa Agama praying for successful conduction of all utsavas and festivities of Brahmotsavam.

 

Traditionally Ankurarpanam fete is performed after sunset as seeds are sown for sprouting in accordance with Samurtharchansa sadhikarana of Maharshi Athree. The seeds are covered in a cloth and Punyahavachanam is performed amidst Veda mantras and Mangala Vadyam.

 

TTD Chairman Sri YV Subba Reddy couple, TTD EO Sri AV Dharma Reddy couple, board members Sri Maruti Prasad, Sri Ramulu, CVSO Sri Narasimha Kishore, Srivari temple DyEO Sri Ramesh Babu and others were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుమ‌ల‌, 2022 సెప్టెంబ‌రు 26: తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబ‌రు 27 నుండి అక్టోబ‌రు 5వ తేదీ వ‌ర‌కు అంగరంగ వైభవంగా జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమ‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఇందులో భాగంగా సేనాధిపతి ఉత్సవం, వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.

విశిష్టత..

వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం.

సూర్యాస్తమయం తరువాతే..

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని ‘సస్యకారక’ అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణంలో పలు పవిత్ర విత్తనాలు నాటడం తెలిసిందే. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయి.

అంకురార్పణ క్రమం..

విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి అనే మహర్షి తన ‘సముర్తార్చన అధికరణ’ అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించాడు.

అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు.

ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగుతుంది.

ఈ కార్యక్రమంలో చైర్మ‌న్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి దంప‌తులు, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు శ్రీ మారుతి ప్ర‌సాద్‌, శ్రీ రాములు, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్ బాబు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.