Annual Brahmotsavam in Sri Venkateswara Swamy Temple, RISHIKESH _ హనుమంత వాహనంపై హృషికేశ్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి

Rishikesh, 09 June 2009: Processional deity of Lord Venkateswara Swamy is taken out in procession atop Hanumantha Vahanam on 6th day ongoing Annual Brahmotsavam in Sri Venkateswara Swamy Temple in Rishikesh Tuesday morning.
 
Later Sri V.S.B.Koteswara Rao, Chief Engineer inspected the ongoing construction works in Andhra Ashram, Rishikesh.
 
Sri T.Ravi, Public Relations Officer, TTDs, Sri V.Rama Rao, Asst Executive Officer and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

హనుమంత వాహనంపై హృషికేశ్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామి

తిరుపతి, జూన్‌-9, 2009: హృషికేశ్‌లోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక శ్రీవారిబ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారు హనుమంత వాహనం పై హృషికేశ్‌ పురవీధులలో  ఊరేగారు. హృషికేశ్‌లోని త్రివేణి గాట్‌ రోడ్డు, లక్ష్మణజూలా రోడ్డు, ప్రధానపురవీధుల గుండా ఈ ఊరేగింపు కొనసాగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలనుండి విచ్చేసిన దాససాహిత్య ప్రాజెక్టుకళాకారుల కోలాటాలు, భజనలు స్థానిక భక్తులను ఆద్యంతం ఆకట్టుకున్నాయి. పురవీధుల గుండా స్వామివారు ఊరేగుతున్న సమయంలో స్థానిక భక్తులు వందలాది మంది కుటుంబ సభ్యులతో కలసివచ్చి స్వామివారికి కర్పూరహారతులు ఇచ్చారు. అంతేకాకుండా స్థానిక భక్తులు ఈ బ్రహ్మోత్సవాలను ఒక పండుగ వాతావరణంగా భావించి భక్తులందరికి మంచినీరు, తేనీరు, మజ్జిగ ప్యాకెట్లు, ప్రసాదాలను అందజేశారు. అంతక మునుపు ఉదయం 5గంటలకు స్వామివారిని సుప్రభాతంతో మేలుకొలిపి ఆలయంలో శుద్ధి, తోమాలసేవ, అర్చనసేవలను నిర్వహించారు. వాహనసేవ అనంతరం ఆలయంలో స్నపన తిరుమంజనం, ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించారు.

ఈ ఉత్సవంలో ఇతర మతాలకు చెందిన భక్తులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొనడం ఒక విశేషం. అదేవిధంగా సాయంత్రం స్వామివారు గజవాహనం పై పురవీధులలో ఊరేగుతూ భక్తులకు కనువిందైన దర్శనం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో తితిదే ఛీఫ్‌ఇంజనీరు శ్రీ వి.ఎస్‌.బి.కోటేశ్వరరావు, ప్రజాసంబంధాల అధికారి శ్రీ టి.రవి, ఎ.ఇ.ఓ. శ్రీ కోదండరామారావు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు శ్రీ శివరామకృష్ణ, డిప్యూటి ఇ.ఇ. శ్రీ దామోదరం, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

సంక్షిప్త సమాచారం:-
ఆరవరోజు ఉదయం బ్రహ్మోత్సవాలలో వరదహస్తం దాల్చిన వేంకటాద్రి రాముడు హనుమద్వాహనంపై ఊరేగాడు. హనుమంతుడు భగవద్భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణపండితుడుగా, లంకాభీకరుడుగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి హృషికేశ్‌ పురవీధులలో  దర్శనమివ్వడం భక్తకోటికి హర్షోత్కర్షం ఆపాదిస్తుంది. హనుమంతుడు చిరంజీవి.

హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతి ప్రసాదిస్తున్నాడు. అందుకే ఇలా అన్నారు-
బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగతా|          అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణా ద్భవేత్‌||
బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వం, ఆరోగ్యం, అజాడ్యం, వక్తృత్వం హనుమంతుని స్మరిస్తే లభిస్తాయి.

అంజన వరపుత్రుడు ఆంజనేయుడు. ఆమె తపఃఫలంగా జన్మించిన కుమారుడు. అందువల్ల అంజనా తనయుడు అంజనాద్రీశ్వరునికి వాహనం కావడం ముదావహం. శ్రీరాముణ్ణి ఇతడు తన భుజంపైన వహించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. అందువల్ల రాముని ప్రతిరూపమైన వేంకటేశ్వరుని హనుమంతుడు మోయడం ఉపపన్నమే.

రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్త్వాన్ని బోధించినట్లు ప్రాచీనవాజ్ఞ్మయం నుండి తెలుస్తున్నది. సీతా రామాంజనేయ సంవాదం వంటి తెలుగు కావ్యాలు కూడా ఈ కోవకు చెందినవే. శ్రీవైష్ణవ సంప్రదాయంలో గరుడసేవను పెరియతిరువడి, ఈ హనుమద్వాహన సేవను సిరియ తిరువడిగా కీర్తిస్తున్నారు. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన కావించిన మహనీయులు కనుక వాహ్య వాహక రూపంలో ఈ ఇరువురినీ చూచిన వారికి వేదాలతత్త్వం కర తలామలకం అవుతున్నది.  

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.