BRAHMOTSAVAMS OF SARVA SWATANTRA LAKSHMI OFF TO A GRAND START WITH DHWAJAROHANAM _ ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Tiruchanoor, 23 Nov. 19: The annual Karthika Brahmotsavams of Sri Padmvathi Devi at Tiruchanoor off to a religious start on Saturday with the ceremonious Dhwajarohanam.

The archakas recited the mantras as per Pancharatra Agama Vidhi and performed the fete. 

To appease all the deities, the Raagas including Kousika, Mayamalavagowla, Kaanada, Sriraagam, Sankarabharanam,  Takkesi,  Sumantha, Ekaranjani etc.were rendered by Nadaswaram artistes.

Later the Gaja Dhwajapatham was hoisted over the temple pillar in the designated auspicious hour in Vrischika Lagnam at 8.50am. Sri Vempalli Srinivasulu acted as Kankanabhattar for the entire event.

TTD Trust Board chief Sri YV Subba Reddy,  EO Sri AnilKumar Singhal, Member Smt Prasanthi Reddy,  DyEO Smt Jhansi Rani and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATION OFFICER, TIRUPATI

ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2019 న‌వంబ‌రు 23: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ప‌ట్ట‌పుదేవేరి అయిన తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు శ‌నివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు కన్నులపండుగగా జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా తొలిరోజు ఉదయం 8.50 గంటలకు వృశ్చిక‌ లగ్నంలో వేదమంత్రోచ్ఛారణ మధ్య ధ్వజారోహణం నిర్వహించారు. కంకణభట్టార్‌  శ్రీ వేంప‌ల్లి శ్రీ‌నివాసులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.

గజపట ప్రతిష్ఠ :            

ఆలయంలో ఉదయం అమ్మవారికి సుప్రభాతం నిర్వహించారు. ఇదే సమయంలో యాగశాలలో గజపట ప్రతిష్ఠ చేపట్టారు. గజ ప్రతిష్ఠలో భాగంగా గజధ్యాన శ్లోకం, గజ మంగళాష్టకం, గరుడ గద్యం వళ్లించి అపరాధ క్షమాపణం కోరారు. ఈ గరుడ గద్యం ప్రస్తావన  కాశ్యప సంహితలో ఉంది. ఈ సందర్భంగా రక్షాబంధనం, ఛాయాధివాసం, ఛాయా స్నపనం, నేత్రోల్మీనలనం, తత్వన్యాస హోమం, ప్రాణప్రతిష్ట హోమం, పూర్ణాహుతి చేపట్టారు. ఆ తరువాత గజపటాన్ని ధ్వజారోహణ మంటపానికి తీసుకొచ్చారు.

సకలదేవతలకు ఆహ్వానం :             

ధ్వజారోహణ ఘట్టంలో మొదటగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం నిర్వహించారు. నెయ్యి, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచగవ్యం, పాలు, పెరుగు, తేనె, పసుపునీటిని తొమ్మిది కలశాల్లో ఉంచి పరవాసుదేవ, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర దేవతలను ఆవాహన చేశారు. ఆ తరువాత షోడషోపచారాలు నిర్వహించారు. చతుర్వేదాలను పారాయణం చేశారు. ధ్వజస్తంభానికి అభిషేకం తరువాత బ్రహ్మూత్సవాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని దేవతలను ప్రార్థిస్తూ రక్షాబంధనం చేశారు.

రాగ, తాళ నివేదన :

రాగ స్వర తాళాలతో దేవతలను, పంచాయుధాలను, కుముదాది గణాలను ఆహ్వానించారు. కుబేరుడి కోసం శ్రీరాగం, పరమేశ్వరుడి కోసం శంకరాభరణం, గజరాజు కోసం మాళవగౌళ, బ్రహ్మ కోసం ఏకరంజని, వరుణుడి కోసం కానడ, వాయువు కోసం తక్కేసి రాగాలను మంగళవాయిద్యాలపై పలికించారు. అదేవిధంగా గాంధార రాగం, మురళీ రాగం, నాటభాగ రాగం, కల్యాణి రాగం – ఆదితాళం, భుజంగ రాగం – ధ్రువ తాళం, గరుడాఖ్యి రాగం, సావేరి రాగం – త్రిపుట తాళం, సుమంత రాగం – నాట తాళం, మధ్యమావతి రాగం – మధ్య తాళం, సౌరాష్ట్ర రాగం – రూపక తాళం, బేగడ రాగం – ఏక తాళం, రేగుప్త రాగం – శంబే తాళం, పంతువరాళి రాగం – మల్ల తాళం, సామంత రాగం, రామక్రియ రాగం – సింహళిక తాళం, కాంభోజి రాగం – సింహవిక్రమ తాళం, దేవగాంధార రాగం – శ్రీరంగ తాళం, కారీ రాగం – గజలీలా తాళం, వరాళి రాగం – చించత్పుర తాళం, అనంత తాళం, కౌషిక రాగం – ఘర్మ తాళం, ఘంటా రాగం – నృసింహ తాళం, భూపాల రాగం – సింహనాద తాళం ఆలపించారు. భూలోకం, సువర్ణ లోకం, పాతాళ లోకాల నుంచి దేవతలను ఆహ్వానించేందుకు గజపటం ఆరోహణం చేయడంతో ధ్వజారోహణ పర్వం ఘనంగా ముగిసింది.

ఈ కార్యక్రమంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, బోర్డు స‌భ్యులు శ్రీ వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విఎస్‌వో శ్రీ ప్ర‌భాక‌ర్‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, పాంచ‌రాత్ర ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ శ్రీ‌నివాసాచార్యులు, అర్చ‌కులు శ్రీ ప్ర‌తాప్‌, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ గోపాల‌కృష్ణారెడ్డి, ఏవిఎస్వో శ్రీ నందీశ్వ‌ర్‌రావు, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ కోలా శ్రీ‌నివాసులు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.