IT’S KIWI AND PINEAPPLE DAY IN SNAPANAM _ కివి, పైనాపిల్, ముత్యాలు తులసి, తామరలతో వేడుకగా స్న‌ప‌న తిరుమంజ‌నం

TIRUMALA, 06 OCTOBER 2024: The second day of Snapana Tirumanjanam witnessed the garlands and crowns knitted in variety of exotic and indigenous fruits visually Kiwi and Pine Apple on Sunday.

After every sacred bath offered to the processional deities at Ranganayakula Mandapam, they were tastefully decked with a colourful range of garlands and crowns that included Turmeric, Kuru Vettiveru, rose petals, yellow pavitrams, white pearls, golden grapes, sandal and Tulasi besides these fruits. 

The sacred snapanam provided a celestial feast to the eyes of devotees who witnessed in on live in SVBC across the world between 1pm and 3pm.

TTD top brass officials and other temple staff were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కివి, పైనాపిల్, ముత్యాలు తులసి, తామరలతో వేడుకగా స్న‌ప‌న తిరుమంజ‌నం

తిరుమల, 2024 అక్టోబ‌రు 06: కివి, పైనాపిల్, ముత్యాలు, తులసి, తామర పూలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి స్న‌ప‌న తిరుమంజ‌నం వేడుకగా జరిగింది. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు అర్చకస్వాములు వేద మంత్రోచ్ఛారణ మధ్య స్న‌ప‌న తిరుమంజ‌నం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనుల‌ను చేసి వివిధ ర‌కాల సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. రంగురంగుల ఆర్కిడ్ పుష్పాలు, తామ‌ర‌ల‌తో వేదిక‌ను సుంద‌రంగా తీర్చిదిద్దారు.

ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం చేపట్టారు.

ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టీటీడీ వేదపారాయణదారులు పారాయణం చేశారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్లు పఠించారు. ఈ వేడుకలో తెల్ల ముత్యాలు, గోల్డ్ గ్రేప్స్, వట్టివేరు, కివి, పైనాపిల్, తులసి, తామర, పసుపు కొమ్ములు మాలలు, రోజ్ పెటల్స్, మల్టీకలర్ రోజ్ పెటల్స్ మాలలు, కిరీటాలు, తులసి దండలు స్వామి అమ్మవార్లకు అలంకరించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.