PUSHPAYAGAM PERFORMED _ వైభవంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం

TIRUPATI, 26 APRIL 2023: The annual Pushpayagam was observed with religious fervour at Sri Kodandarama Swamy temple in Tirupati was held on Wednesday evening.

 

The Pushpayagam, floral ritual was performed between 4pm and 6pm to Sri Sita Lakshmana sameta Sri Rama Chandra Murty with three tonnes of various traditional and aromatic flowers and leaves.

 

Later the deities were taken along four mada streets in a celestial procession.

DyEO Nagaratna, Garden Deputy Director Sri Srinivasulu, AEO Sri Mohan and other temple staff, religious staff, Grihasta devotees were also present.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైభవంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం

తిరుపతి, 2023 ఏప్రిల్ 26: తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో బుధవారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

ఇందులో భాగంగా ఉదయం 10 నుంచి 11 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.

సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఆలయంలోని ఊంజల మండపంలో అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, రోజా, తామర, కలువ, మొగలిరేకులు వంటి 11 రకాల పూలు, ఆరు రకాల ఆకులు కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు యాగం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి దాతలు పుష్పాలను విరాళంగా అందించారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.

శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో పుష్పయాగం చేపట్టారు. మొదటగా అర్చకులు 108 సార్లు విష్ణుగాయత్రి మంత్రాన్ని పఠించి పుష్పాలకు అధిపతి అయిన పుల్లుడు అనే దేవున్ని ప్రసన్నం చేసుకున్నారు. ఇలా చేయడం వల్ల ప్రకృతిమాత పులకించి ఎలాంటి వైపరీత్యాలు తలెత్తకుండా స్వామివారు కరుణిస్తారని నమ్మకం.

బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

పుష్పయాగం అనంతరం రాత్రి 7 నుంచి శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, గార్డెన్‌ సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాసులు, ఏఈఓ శ్రీ మోహన్, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.