RATHOTSAVAM HELD_ వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి రథోత్సవం
వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి రథోత్సవం
తిరుపతి, 24 జూన్ 2024: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో సోమవారం ఉదయం శ్రీనివాసుడు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9 గంటలకు స్వామివారు రథారోహణం చేశారు. ఉదయం 9.25 నుండి 11 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా రథోత్సవం జరిగింది.
ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే.
అనంతరం ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు.ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు.
సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఊంజల్‌సేవ ఘనంగా నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఈఈ శ్రీ నరసింహమూర్తి, ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, కంకణ బట్టర్ శ్రీ సూర్య కుమార్ ఆచార్యలు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివకుమార్ పాల్గొన్నారు.
జూన్ 25న చక్రస్నానం :
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన మంగళవారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం 9.15 నుండి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి, చక్రత్తాళ్వార్‌వారికి వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఉదయం 10.30 నుండి 10.45 గంటల వరకు ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం జరుగనుంది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.