TEMPLE DOORS CLOSED _ సూర్య‌గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత : టిటిడి ఈవో

Tirumala, 20 Jun. 20: As the partial Surya Grahanam falls on Sunday between 10:18am and 1:38pm, the main doors of Tirumala temple were closed on Saturday night after Ekanta Seva.

TTD EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti and others participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సూర్య‌గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత : టిటిడి ఈవో

తిరుమల, 2020 జూన్ 20: సూర్య‌గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాన్ని శ‌నివారం రాత్రి 8.30 గంటలకు మూసివేసినట్టు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆలయం తలుపులు మూసివేసిన అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు.

ఈవో మాట్లాడుతూ ఆది‌వారం ఉదయం 10.18 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 1.38 గంట‌ల వరకు సూర్యగ్రహణం ఉంటుంద‌న్నారు. మ‌ధ్యాహ్నం 2.30 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు ఏకాంతంగా సుప్ర‌భాతం, శుద్ధి, పుణ్యాహ‌వ‌చ‌నం, తోమాల సేవ, కొలువు, బంగారు వాకిలి లోప‌ల పంచాంగ శ్ర‌వ‌ణం, రాత్రి కైంక‌ర్యాలు, ఏకాంతసేవ నిర్వ‌హిస్తార‌ని తెలిపారు. క‌రోనా వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వ‌ల ఆదేశాల మేర‌కు ప్ర‌తి రోజు రాత్రి 7.00 గంట‌ల వ‌ర‌కు వ‌స్తున్న భ‌క్తుల‌కు మాత్ర‌మే ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్నామ‌న్నారు. ఈ కైంక‌ర్యాల కార‌ణంగా జూన్ 21వ తేదీ నాడు పూర్తిగా శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఉండద‌ని తెలియజేశారు.

గ్ర‌హ‌ణం కార‌ణంగా శ‌ని‌వారం రాత్రి నుండి మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాదం కాంప్లెక్సును మూసివేస్తార‌న్నారు. ఆదివారం మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల వ‌ర‌కు ఈ భ‌వ‌నాన్ని తెరిచి వంట‌శాల శుద్ధి, పుణ్యాహవచనం నిర్వ‌హిస్తార‌ని తెలిపారు.

జూన్ 22వ తేదీ సోమ‌వారం ఉద‌యం నుండి భ‌క్తులను శ్రీ‌వారి ద‌ర్శనానికి అనుమ‌తించ‌నున్న‌ట్లు తెలిపారు. అదేవిధంగా సూర్య‌ గ్ర‌హ‌ణం ఉదయం 10.18 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 1.38 గంట‌ల మ‌ధ్య‌ ప్ర‌పంచ శాంతి, సృష్ఠిలోని స‌క‌‌ల జీవ‌రాశులు ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని కోరుతూ తిరుమ‌ల శ్రీ‌వారి పుష్క‌రిణిలో టిటిడి జ‌ప‌య‌గ్నం నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఇందులో శ్రీ‌వారి ఆల‌య అర్చ‌కులు, జీయ్యంగార్లు, సిబ్బంది, ప్ర‌ముఖ వేద పారాయ‌ణ దారులు పాల్గొంటార‌ని తెలిపారు. చూడామ‌ణి – సూర్య గ్ర‌హ‌ణ స‌మ‌యంలో నిర్వ‌హించు జ‌ప – హోమ – అభిషేకాల వ‌ల‌న కోటి రెట్లు పుణ్యఫ‌ల‌ము ల‌భిస్తుందన్నారు. కావున జ‌ప య‌గ్నంలో స్వాములు ప‌ఠించే మంత్రాల‌ను భ‌క్తులు వారి వారి ఇళ్ల‌లో ఉండి ప‌ఠించాల‌ని కోరారు.

ఈవో వెంట టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్‌, ఇతర అధికారులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.