అక్టోబరులో తితిదే ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు

అక్టోబరులో తితిదే ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు

తిరుపతి, 2012 సెప్టెంబరు 24: తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు ఈ ఏడాది అక్టోబరులో జరుగనున్నాయి. ఆసక్తి గల పురుష, మహిళా ఉద్యోగులు అక్టోబరు 15వ తేదీలోపు తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో ఉన్న సంక్షేమ విభాగం కార్యాలయంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. హోదాతో నిమిత్తం లేకుండా కిందిస్థాయి నుండి పైస్థాయి వరకు గల ఉద్యోగులు ఈ క్రీడాపోటీల్లో పాల్గొనవచ్చు.

పురుషులు, మహిళా ఉద్యోగులను వయసుల వారీగా నాలుగు గ్రూపులుగా విభజించి క్రీడాపోటీలు నిర్వహించనున్నారు. 35 ఏళ్లలోపు వయసు గల ఉద్యోగులను మొదటి గ్రూపుగాను, 35 నుండి 45 ఏళ్ల వరకు గలవారిని రెండో గ్రూపుగాను, 45 నుండి 50 ఏళ్ల వరకు గలవారిని మూడో గ్రూపుగాను, 50 నుండి 60 ఏళ్ల వరకు గల ఉద్యోగులను నాలుగో గ్రూపుగాను విభజించారు.

ఉద్యోగులను మొత్తం ఎనిమిది జట్లుగా విభజించారు. అంజనాద్రి జట్టులో తితిదే పరిపాలనా భవనం, అన్ని ప్రాజెక్టుల సిబ్బంది ఉంటారు. గరుడాద్రి జట్టులో ఆలయాలు, రిసెప్షన్‌, కల్యాణకట్ట, తిరుమల, తిరుపతి, బయటి ప్రాంతాల్లోని కల్యాణమండపాల సిబ్బంది ఉంటారు. మెడికల్‌ అండ్‌ హెల్త్‌ విభాగం సిబ్బందిని నారాయణాద్రి జట్టుగా ఏర్పాటుచేశారు. నీలాద్రి జట్టులో ఇంజినీరింగ్‌(సివిల్‌, ఎలక్ట్రికల్‌, వాటర్‌ వర్క్స్‌ మరియు రేడియో, బ్రాడ్‌కాస్టింగ్‌) సిబ్బంది ఉంటారు. శేషాద్రి జట్టులో ప్రెస్‌, ట్రాన్స్‌పోర్ట్‌, ఎడిటర్‌, సేల్స్‌ వింగ్‌ ఆఫ్‌ పబ్లికేషన్‌ సిబ్బంది ఉంటారు. వెంకటాద్రి జట్టులో విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ మరియు శ్వేత భవనం సిబ్బంది ఉంటారు. వృషభాద్రి జట్టులో తితిదే విద్యాసంస్థల్లోని అన్ని కళాశాలలు, పాఠశాలల సిబ్బంది ఉంటారు. శ్వేత వరాహకల్ప జట్టులో అటవీ మరియు వన విభాగం సిబ్బంది ఉంటారు.

ప్రత్యేక ప్రతిభావంతులైన ఉద్యోగులకు వారికి అనుకూలంగా ఉన్న క్రీడాంశాల్లో ప్రత్యేకంగా పోటీలు నిర్వహిస్తారు. ఇందులో వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌ (సింగిల్స్‌, డబుల్స్‌), క్యారమ్స్‌ (సింగిల్స్‌, డబుల్స్‌), చెస్‌, బాల్‌ త్రో, హిట్టింగ్‌ ద ఇండియన్‌ క్లబ్స్‌, త్రోయింగ్‌ ఆన్‌ ది స్టిక్‌, బకెటింగ్‌ ది బాల్‌, 50 మీటర్ల నడక పోటీ, షాట్‌పుట్‌, స్టాండింగ్‌ బోర్డ్‌ జంప్‌ క్రీడాంశాలు ఉన్నాయి.

పురుష, మహిళా ఉద్యోగులకు విడివిడిగా షటిల్‌ బ్యాడ్మింటన్‌(సింగిల్స్‌, డబుల్స్‌), క్యారమ్స్‌(సింగిల్స్‌, డబుల్స్‌), చెస్‌, లాన్‌ టెన్నిస్‌(సింగిల్స్‌, డబుల్స్‌), టేబుల్‌ టెన్నిస్‌(సింగిల్స్‌, డబుల్స్‌), టెన్నికాయిట్‌(సింగిల్స్‌, డబుల్స్‌), బాల్‌ బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, క్రికెట్‌, ఫుట్‌బాల్‌, హాకీ, కబడ్డీ, వాలీబాల్‌ క్రీడాంశాల్లో పోటీలు జరుగనున్నాయి. వీటితోపాటు 75 మీటర్లు, 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పోటీ, లాంగ్‌జంప్‌, హైజంప్‌, షాట్‌పుట్‌, డిస్క్‌త్రో, జావెలిన్‌త్రో, బకెటింగ్‌ ది బాల్‌, హిట్టింగ్‌ ది ఇండియన్‌ క్లబ్స్‌, 3 కి.మీ నడక పోటీ, త్రోబాల్‌ పోటీలు నిర్వహించనున్నారు.
   
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.