అక్టోబరు 27 న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థానం
అక్టోబరు 27 న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థానం
తిరుపతి, 2019 అక్టోబరు 18: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అక్టోబరు 27వ తేదీ ఆదివారం దీపావళి సందర్భంగా సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం వైభవంగా జరుగనుంది.
ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి శ్రీవారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు.
అక్టోబరు 22న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం –
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అక్టోబరు 27న దీపావళి ఆస్థానం సందర్భంగా అక్టోబరు 22వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 9.00 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.
అక్టోబరు 23 నుండి నవంబరు 1వ తేదీ వరకు శ్రీ మనవాళ మహాముని సాలకట్ల ఉత్సవం-
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి ఉప ఆలయమైన శ్రీ మనవాళ మహాముని సాలకట్ల ఉత్సవం అక్టోబరు 23 నుండి నవంబరు 1వ తేదీ వరకు ఘనంగా జరుగనుంది. నవంబరు 1వ తేదీన శ్రీ మనవాళ మహాముని సాత్తుమొర నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ఉదయం 10.00 నుండి సాయంత్రం 4.00 గంటల వరకు శ్రీమనవాళ మహాముని ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, శాత్తుమొర నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 5.00 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అప్పా పడిని ఊరేగింపుగా తెచ్చి శ్రీ మనవాళ మహాముని వారికి సమర్పిస్తారు. రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు శ్రీ మనవాళ మహామునితో కలసి తిరుమాఢవీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు.
శ్రీ మనవాళ మహాముని 15వ శతాబ్దంలో విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని తన శిష్యగణం ద్వారా వ్యాప్తిచేసిన శ్రీవైష్ణవ ఆచార్యపురుషుడు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.