అచ్చ తెలుగు పదం అన్నమయ్య సొంతం : ఆచార్య రవ్వా శ్రీహరి

అచ్చ తెలుగు పదం అన్నమయ్య సొంతం : ఆచార్య రవ్వా శ్రీహరి

తిరుపతి, ఏప్రిల్‌  10, 2013: అన్నమయ్య ఆనాడు జనబాహుళ్యంలో ఉన్న అచ్చ తెలుగు పదాలతో తిరుమల శ్రీవారిపై  వేలాది సంకీర్తనలు రచించారని తితిదే ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ఆచార్య రవ్వా శ్రీహరి తెలిపారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 510వ వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో నిర్వహిస్తున్న సాహితీ సదస్సులు బుధవారం మూడో రోజుకు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా ”అన్నమయ్య పదకోశం – సమీక్ష” అనే అంశంపై ఆచార్య రవ్వా శ్రీహరి ప్రసంగిస్తూ ఆనాడు పండితుల భాషగా ఉన్న సంస్కృతాంధ్ర పదాలను కాకుండా, సాధారణ జనం మాట్లాడే భాషతో, రాయలసీమలోని మాండలికాలతో కీర్తనలు రచించినట్టు వివరించారు. దీన్ని బట్టి అన్నమయ్యను వ్యవహారిక భాషోద్యమానికి ఆద్యుడని భావించవచ్చన్నారు. పలువురు పండితుల రచనలు, వివిధ నిఘంటువులు, ఇతర ఆధారాలను పరిశోధించి అన్నమయ్య పదకోశాన్ని సిద్ధం చేసినట్టు తెలిపారు.
సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన విజయవాడకు చెందిన డాక్టర్‌ టి.నిర్మల ”తొలి తెలుగు కవయిత్రి తిమ్మక్క” అనే అంశంపై ఉపన్యసిస్తూ తిమ్మక్క తన రచనల్లో నాటి, నేటికాలంలోని స్త్రీ స్వభావ చిత్రణను అద్భుతంగా చేశారని కొనియాడారు.

అనంతరం చిత్తూరుకు చెందిన జిల్లా రచయితల సంఘం అధ్యకక్షుడు డాక్టర్‌ ఇ.బాలకృష్ణారెడ్డి ”అన్నమయ్య ప్రబోధం” అనే అంశంపై ఉపన్యసిస్తూ అన్నమయ్య సమాజంలో ఉండే అవకతవకలను సంస్కరించడానికి అనేకమైన హితోక్తులు మానవాళికి అందించినట్టు తెలిపారు.

చెన్నైకి చెందిన ఎల్‌.బి.శంకరరావు ”అన్నమయ్య ఆధ్యాత్మ సంకీర్తనల్లో జాతీయాలు-సామెతలు” అనే అంశంపై ఉపన్యసిస్తూ గ్రామీణ ప్రజానీకం వాడే జాతీయాలను అన్నమయ్య తన సంకీర్తనల్లో విరివిగా ఉపయోగించారని తెలిపారు. అనంతరం తిరుపతికి చెందిన శ్రీ టి.అనంతనారాయణ ”అన్నమయ్య సంకీర్తనల్లో వేదమంత్రాలు” అనే అంశంపై ఉపన్యసిస్తూ వేద మంత్రాల్లోని భావాలను ఆకళింపు చేసుకుని అన్నమయ్య కీర్తనలు రచించినట్టు వివరించారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్‌ మేడసాని మోహన్‌ ఉపన్యాసకులను శ్రీవారి ప్రసాదం, శాలువతో సన్మానించారు.
అనంతరం సాయంత్రం 6.00  నుండి 7.30 గంటల వరకు బెంగళూరుకు చెందిన కుమారి వి.అపర్ణ బృందం సంగీత సభ, రాత్రి 7.45 నుండి 9.00 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ ఎం.పి.రమేష్‌ అన్నమయ్య సంకీర్తన వాయిద్య లహరి నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.