ANNAMACHARYA WAS A GREAT SOCIAL REFORMER _ అన్నమయ్య గొప్ప సామాజికవేత్త : శ్రీ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి

TIRUPATI, 29 MAY 2024: The saint poet Sri Tallapaka Annamacharya was a great social reformer who taught the society of the human values through his impeccable Sankeertans, said SVETA Director Sri Bhuman Subramanyam Reddy.

Chairing the literary session as a part of the 616th Annamacharya Jayanti celebrations, Sri Bhuman spoke on Annmaiah-Samajikata and said the great saint poet fought against all social odds that prevailed in the society those days by penning extraordinary Sankeertans like Brahmamokkate Para Brahmamokkate… 

Scholars Dr Srinivasa Reddy spoke on Annamaiah-Janapadam and elaborated on the various folklores penned by the saint poet.

Dr Yuvasri of Mahila University given lecture on Annamaiah-Sri Krishna Tatvam.

Annamacharya Project Director Dr Vibhishana Sharma, denizens of Tirupati were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అన్నమయ్య గొప్ప సామాజికవేత్త : శ్రీ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి

తిరుపతి, 2024 మే 29: భగవంతుని దృష్టిలో మనుషులందరూ సమానమేనని తన సంకీర్తనల ద్వారా చాటి చెప్పిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య గొప్ప సామాజికవేత్త అని శ్వేత సంచాలకులు శ్రీ భూమన సుబ్రహ్మణ్యంరెడ్డి చెప్పారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 616వ జయంతి ఉత్సవాలు బుధ‌వారం ఘ‌నంగా ముగిశాయి.

ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన శ్రీ భూమన్ “అన్నమయ్య – సామాజికత” అనే అంశంపై ఉపన్యసించారు. ఆనాటి సామాజిక ప‌రిస్థితుల్లో అన్ని వృత్తుల వారు స‌మాన‌మేన‌ని, రాజు – పేద తేడాలు ఉండ‌కూడ‌ద‌ని, అంద‌రికీ శ్రీ‌హ‌రే అంత‌రాత్మ అని అన్న‌మ‌య్య తెలియ‌జేశార‌ని చెప్పారు. ఆశ్ర‌మ‌ధ‌ర్మాల్లో గృహ‌స్తాశ్ర‌మ గొప్ప‌ద‌నాన్ని సంకీర్త‌న ద్వారా తెలియ‌జేశార‌న్నారు. పలు సంకీర్తనల్లో రాయలసీమ మండలికానికి పెద్దపీట వేశారని చెప్పారు. అన్నమయ్య కీర్తన‌లను చదివినా, విన్నా వ్యక్తిత్వ వికాసం క‌లుగుతుంద‌ని తెలిపారు. ఈ విషయాలను సాధారణ ప్రజలకు సైతం అర్థమయ్యేలా అన్నమయ్య సంకీర్తనలు రచించారని వివరించారు. అత్యంత సంస్కారవంతంగా శృంగార సంకీర్తనలు రచించి భక్తి భావాన్ని వ్యాప్తి చేశారని తెలియజేశారు. అన్యమతాలకు చెందిన ప్రభువులు, రాజులు తిరుమల సందర్శించినప్పుడు స్వామివారికి సమర్పించిన కానుకలను తిరుమల కొండపై ఇప్పటికీ చూడవచ్చన్నారు.

తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయం అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి “అన్నమయ్య – జానపదం”. అనే అంశంపై మాట్లాడుతూ, భారతీయ ఆత్మ జానపదంలో ఉందని తెలిపారు. అన్నమయ్య ఆనాటి జనజీవనాన్ని తన సంకీర్తనల్లో ప్రతిబింబ చేశారన్నారు. అన్నమాచార్య సంకీర్తనలు భావితరాలకు ఉపయుక్తంగా ఉంటాయని, సంస్కృతి – సంప్రదాయాలు, ఆనాటి జానపద గేయాలు, జాతీయాలు, మండలికాలు, సామెతలు, పురాణ గాథలను అన్నమయ్య తన సంకీర్తన ద్వారా తెలియజేశారని వివరించారు.

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ యువ శ్రీ “అన్న‌మ‌య్య – శ్రీ‌కృష్ణ‌త‌త్త్వం” అనే అంశంపై ప్రసంగించారు. శరణాగతి, లోకనీతి, వేదాల్లోని సారాన్ని కలిపి అన్నమయ్య తన సాహిత్యాన్ని సృష్టించారని చెప్పారు. యావత్‌ భక్తి సాహిత్యంలో అన్నమయ్యకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. అన్ని మంత్రాల సారం శ్రీ వేంకటేశ్వర మంత్రంలో ఉందంటూ స్వామివారిపై ఎనలేని భక్తిని చాటారన్నారు. అన్నమయ్య జీవిత విశేషాలను పరిశీలిస్తే తెలుగునాట భాగవత శిఖామణులుగా, భాగవతోత్తములుగా గుర్తింపు పొందారని చెప్పారు. ఆయ‌న కీర్తనలలో సామాన్య ప్రజలను చైతన్యవంతం చేసేలా, భక్తిభావాన్ని పెంచేలా ఉన్నాయన్నారు. అన్నమయ్య సంకీర్తనల్లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడు తదితర దేవతలకు ప్రాధాన్యం కల్పించారని వివరించారు.

అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. విభీషణ శర్మ, వక్తలను శాలువ, శ్రీవారి తీర్థప్రసాదాలతో సన్మానించారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.