అన్నమయ్య భవన్ హోటల్ బకాయి వసూలుపై వివరణ
అన్నమయ్య భవన్ హోటల్ బకాయి వసూలుపై వివరణ
తిరుమల, 2021 సెప్టెంబరు 01: ఇటీవల కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో తిరుమలలోని అన్నమయ్య భవన్ హోటల్ నిర్వాహకులకు టిటిడి అధికారులు సహకరించి సుమారు మూడు కోట్ల రూపాయలు నష్టం వాటిళ్లేలా చేశారని, బెంగళూరులోని ఒక సంస్థకు సదరు హోటల్‌ను కేటాయించడానికి, క్రమంగా తిరుమలలోని అన్ని హోటళ్లను సదరు సంస్థకు కేటాయించేలా తెరచాటు ప్రయత్నాలు జరుగుతున్నాయని, సత్యదూరమైన, నిరాధారమైన చౌకబారు ఆరోపణలు చేయడం బాధాకరం.
సదరు అన్నమయ్య భవన్ హోటల్ నిర్వాహకులకు ప్రయోజనం కల్గించేలా టిటిడి వ్యవహరించిందనడంలో వాస్తవం లేదు. మిగిలిన హోటళ్లతోపాటు సదరు హోటల్ నిర్వాహకుల నుండి రావాల్సిన బకాయిలు వసూలు చేయడానికి టిటిడి ఎప్పుడూ వెనక్కు తగ్గలేదు. ఇంకా రావలసిన బకాయిలను రాబట్టడానికి టిటిడి చట్టపరమైన అన్ని చర్యలను తీసుకోవటం జరుగుతోంది.
అంతేగాక తిరుమలకు విచ్చేసే భక్తులకు గో ఆధారిత వ్యవసాయం ద్వారా వచ్చిన ఉత్పత్తులతో అన్నప్రసాదం అందజేయడానికి టిటిడి చేస్తున్న పవిత్రమైన ప్రయత్నాలను కూడా తప్పు పట్టడానికి కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం శోచనీయం. సనాతన హిందూ ధర్మంలో గోవుకు ఉన్న ప్రాధాన్యం, తల్లికి ఉన్న ప్రాధాన్యం సమానమైనది. సర్వ దేవతామూర్తుల ప్రతిరూపంగా గో ఆరాధన చేయడం ఈ దేశ సంప్రదాయం. గో ఆధారిత వ్యవసాయం ద్వారా ఉత్పత్తులను పెంచి రైతన్నలకు వెన్నుదన్నుగా టిటిడి నిలబడుతుందని, హిందూ ధర్మాన్ని పరిరక్షించే పవిత్ర ఆశయానికి టిటిడి కట్టుబడి ఉంటుందని ఏమాత్రం వెనుకంజ వేయదని తెలియజేయడమైనది.
అంతేగాక సత్యదూరమైన, ఆధారరహితమైన వార్తలు ప్రచురించడం, సామాజిక మాధ్యమాల ద్వారా టిటిడి ప్రతిష్టకు భంగం కలిగిస్తూ, అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించే వారిపై టిటిడి తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని తెలియజేయడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.