అర్చకులు హైందవ ధర్మ పరిరక్షకులు : తితిదే సివిఎస్‌వో శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌

అర్చకులు హైందవ ధర్మ పరిరక్షకులు : తితిదే సివిఎస్‌వో శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌

తిరుపతి, సెప్టెంబరు 28, 2013: భారతీయ సంస్కృతికి దేవాలయాలు మూలస్తంభాలని, అలాంటి ఆలయాల్లో భగవంతునికి సేవ చేసే అర్చకులు హైందవ ధర్మ పరిరక్షకులని తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ వెల్లడించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో ఐదు రోజుల పాటు జరిగిన ఐదో విడత వైదిక స్మార్థ ఆగమ అర్చక శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి.

ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సివిఎస్‌వో మాట్లాడుతూ హిందూ ధర్మప్రచారంలో అర్చక శిక్షణ ఒక భాగమన్నారు. అర్చకులు ఇలాంటి పునశ్చరణ తరగతుల్లో పాల్గొని తమ ప్రతిభను మరింత పెంచుకోవాలని కోరారు. ఇక్కడ శిక్షణలో అర్చకులు నేర్చుకున్న విషయాలను తమ తమ ప్రాంతాల్లోని ఇతర అర్చకులకు కూడా తెలియజేయాలన్నారు. అర్చకత్వాన్ని భావితరాలకు అందించేందుకు అర్చకులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. శ్వేత సంచాలకులు డాక్టర్‌ కె.వి.రామకృష్ణ మాట్లాడుతూ అర్చకులు క్రమశిక్షణ, భక్తి చైతన్యాన్ని క్రమంగా పెంచుకోవాలని కోరారు. మంత్రభావాన్ని అర్థం చేసుకుని పఠించడం ద్వారా పూర్తి ఫలితాలు రాగలవని విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం శిక్షణ తరగతుల్లో పాల్గొన్న మొత్తం 69 స్మార్థ ఆగమ ఆర్చకులకు ధ్రువపత్రాలు, శ్రీవారి చిత్రపటాలు అందజేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.