అవినీతిని నిర్మూలిస్తేనే దేశాభివృద్ధి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ టిటిడిలో ముగిసిన విజిలెన్స్ అవగాహన వారోత్సవం
అవినీతిని నిర్మూలిస్తేనే దేశాభివృద్ధి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ టిటిడిలో ముగిసిన విజిలెన్స్ అవగాహన వారోత్సవం
తిరుపతి, 2019 నవంబరు 02: అవినీతిని నిర్మూలిస్తేనే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. టిటిడిలో అక్టోబరు 28న ప్రారంభమైన విజిలెన్స్ అవగాహన వారోత్సవం శనివారం నాడు ముగిసింది.
ఈ సందర్భంగా తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఈవో మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, ఈ క్రమంలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో పనిచేసి మెరుగైన సేవలందించాలని, సంస్థకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు వీలుగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అవకతవకలకు పాల్పడేవారికి శిక్ష కఠినంగా ఉంటే పునరావృతం కావన్నారు.
టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి మాట్లాడుతూ విజిలెన్స్ అవగాహన వారోత్సవం సందర్భంగా అన్ని విభాగాలు, విద్యాసంస్థల్లో ప్రతిజ్ఞ చేపట్టామని, కరపత్రాలు ముద్రించి పంపిణీ చేశామని వివరించారు. ఈ వారోత్సవం ముగింపు సందర్భంగా టిటిడి విద్యాసంస్థల్లోని విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించినట్టు చెప్పారు. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆభరణాల కేసు విచారణలో ప్రతిభ కనబరిచిన తిరుపతి అర్బన్ పోలీసు బృందాన్ని, విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టిటిడి నిఘా మరియు భద్రతా విభాగం అధికారులను, సిబ్బందిని ప్రశంసాపత్రాలకు ఎంపిక చేశామన్నారు.
అనంతరం టిటిడి ఈవో చేతులమీదుగా పోలీసులకు, విజిలెన్స్ అధికారులకు, సిబ్బందికి, విద్యార్థులకు ప్రశంసాపత్రం, బహుమతులను ప్రదానం చేశారు. వీరిలో టిటిడి డెప్యూటీ ఇఇ శ్రీ రాధాకృష్ణారెడ్డి, 14 మంది తిరుపతి అర్బన్ పోలీసులు, 49 మంది టిటిడి నిఘా మరియు భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది, టిటిడి విద్యాసంస్థలకు చెందిన 12 మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విఎస్వో శ్రీ ప్రభాకర్, విజిలెన్స్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.