అష్టోత్తర శతకుండాత్మక అద్భుత మహాశాంతియాగం

అష్టోత్తర శతకుండాత్మక అద్భుత మహాశాంతియాగం

తిరుపతి, జనవరి 29, 2011: ఈ విశ్వంలోని మానవులందరూ సుఖసంతోషాలతో, ప్రేమానురాగాలతో, సమైక్యభావనతో జీవించాలనే మహదాశయంతో తిరుమల తిరుపతి దేవస్థానముల వారు హిందూధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం వద్ద వున్న విశాల ప్రాంగణంలో అష్టోత్తర శత (108) కుండాత్మక అద్భుతమహాశాంతియాగాన్ని వైఖానసఆగమోక్తంగా ఈనెల 29,30,31 తేదీలలో త్రయాహ్నిక దీక్షతో నిర్వహిస్తున్నారు.

సృష్టిలోని ప్రాణికోటికే కాకుండా విశ్వేదేవతలు కూడా ఇలాంటి యాగాల వల్ల సంప్రతులౌతారు. వరుణదేవుడు కరుణించి నదీనదాలు జలాలతో నిండిపోతాయి. ఆకాశం, వాయువు, జలం, అగ్ని, భూమి – పంచభూతాలు శాంతించి ముక్కారు పంటలు పండుతాయి. ఓషధులు వర్థిల్లి ప్రాణులకు ఆరోగ్యాన్ని సమకూర్చుతాయి.

యజ్ఞయాగాల ద్వారా కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీనివాసుని అనుగ్రహానికి ప్రజలు పాత్రులవుతారు. అహింసాయుతంగా ఐకమత్యభావంతో ప్రజలందరూ వ్యాధిభయ, చోరభయ, దుర్భిక్షభయాలకు దూరంగా ఉంటారు. విజయ, వీర్య, ధైర్య, స్థైర్యాలతో జీవిస్తారు. అధికారులకు రాజద్వార మర్యాదలు లభిస్తాయి. ఇంద్రాదిదేవతలశాంతి సిద్ధ్యర్థం, సర్వజన శుభసిద్ధ్యర్థం జరుగుతున్న ఈ యాగంలో నెయ్యితోపాటు రావి, శమి, జువ్వి లాంటి పవిత్ర సమిధల్ని హోమం చేస్తారు. ఆపవిత్ర పరిమళాలు వాతావరణ కాలుష్యాన్ని తొలగించి పరిశుద్ధమైన ప్రాణవాయువును ప్రాణికోటికి అందిస్తాయి.

శుక్రవారం ఉదయం 8 గంటలకు అద్భుతశాంతి యాగంలో భాగంగా దేవసేనాపతి అయిన విష్వక్సేనుల వారిని ఆహ్వానించి యాగభూమి పరిసరాల పర్యవేక్షణ భాద్యతలను అప్పగించారు. వాస్తుహోమాన్ని నిర్వహించి పరిసరాల దోష ప్రభావాలను పరిహరింపజేసారు. పుణ్యాహవచనంతో యాగభూమిని పునీతం చేస్తారు. యాగవేదిక మీద కోలువుతీరిన యజ్ఞస్వరూపుడైన విష్ణుదేవుని అర్చిస్తారు. స్వాహాది మంత్రాలతో ఆయా దేవతలకు హవిస్సును ఆహారంగా అందించారు.

యజ్ఞవేదికి కుడివైపున 54 హోమకుండాలు, ఎడమవైపున 54 హోమకుండాలు ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. వేదిక మీద అగ్నికుండాలలో మొదటగా అగ్నిని ప్రజ్వలింప చేసారు.

అగ్ని ప్రతిష్ఠ – 108 కుండాల ముందు 108 మంది ఋత్విక్కులు కూర్చుని ఏకకాలంలో అగ్నిని ప్రతిష్ఠించి యాగాన్ని కొనసాగించారు.

నిర్విఘ్నంగా జరుగుతున్న ఈ యజ్ఞవేదిని తి.తి.దే పాలకమండలి అధ్యకక్షులు డి.కె.ఆదికేశవులు గారు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి, ఉప కార్యనిర్వహణాధికారి, ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి రాళ్ళబండి కవితాప్రసాద్‌ సందర్శించుకుని స్వామివారి ఆశీరాక్షతల్ని అందుకున్నారు.

సాయంకాలం ప్రతిరోజు విష్ణుసహస్రనామ పారాయణంతో పాటు పవిత్రయాగం కొనసాగుతుంది. దేవస్థానం ఆగమసలహాదారు డాక్టర్‌ వేదాన్తం, శ్రీ విష్ణుభట్టాచార్యుల వారి పర్యవేక్షణలో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రాంతాల నుండి విచ్చేసిన 150 మంది వైఖానస పండిత ప్రకాండులచేత ఈ యాగం సంప్రదాయసిద్ధంగా కొనసాగుతోంది. 

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.