ఆకట్టుకున్న చెన్నై కళాకారుల పంచవాద్య సంగీతం, కేరళ కళాకారుల మోహినీ అట్టం నృత్యం

సంగీతాభ్యసనలో టెక్నాలజీ పాత్ర కీలకం

•⁠ ⁠రసరిషి అధ్యయన కేంద్రం ప్రొఫెసర్ డా. నందకుమార్

•⁠ ⁠ఆకట్టుకున్న చెన్నై కళాకారుల పంచవాద్య సంగీతం, కేరళ కళాకారుల మోహినీ అట్టం నృత్యం

•⁠ ⁠వీనులవిందుగా సాగిన ఎస్వీ సంగీత కళాశాల విద్యార్థుల లయవిన్యాసం, భక్తప్రహ్లాద యక్షగానం

•⁠ ⁠ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాల విశ్రాంత, ప్రస్తుత ఉపాధ్యాయులకు సన్మానం

•⁠ ⁠రెండో రోజుకు చేరిన దక్షిణ భారత సంగీత, నృత్యోత్సవం

తిరుప‌తి, 2024, ఫిబ్ర‌వ‌రి 15: సంగీతాభ్యసనలో టెక్నాలజీ పాత్ర ఎంతో కీలకంగా మారిందని, విద్యార్థులు దాన్ని అందిపుచ్చుకుని సాధన చేయాలని కర్ణాటకలోని రసరిషి అధ్యయన కేంద్రం ప్రొఫెసర్ డా. నందకుమార్ సూచించారు. శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల మరియు ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాల ఆధ్వర్యంలో తిరుపతి మహతి కళామందిరంలో కళావైభవం పేరిట నిర్వహిస్తున్న దక్షిణ భారత సంగీత నృత్యోత్సవం గురువారం రెండో రోజుకు చేరుకుంది.

ఈ సందర్భంగా “సంగీత విద్యలో టెక్నాలజీ పాత్ర” అనే అంశంపై రసరిషి అధ్యయన కేంద్రం ప్రొఫెసర్ డా. నందకుమార్ అధ్యక్షతన బృంద చర్చ నిర్వహించారు. ఇందులో హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీకి చెందిన డా. రాధ సారంగపాణి మాట్లాడుతూ సంగీత అధ్యయనంలో టెక్నాలజీ ఆవశ్యకత గురించి వివరించారు. చెన్నైలోని మద్రాస్ యూనివర్సిటీకి చెందిన డా. రాజశ్రీ రామకృష్ణ మాట్లాడుతూ టెక్నాలజీ ఉపయోగాలు, లోటుపాట్ల గురించి తెలియజేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయానికి చెందిన డా. శైలేశ్వరి మాట్లాడుతూ సంగీత విద్యను అభ్యసించడంలో వివిధ సాంకేతిక పద్ధతులు ఎలా ఉపయోగపడుతున్నాయో సోదాహరణంగా వివరించారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన డా. వైజర్సు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వయంప్రభ ప్రాజెక్టు సంగీత విద్యను అభ్యసించడానికి ఏ విధంగా తోడ్పడుతుందో వివరించారు.

ఆకట్టుకున్న పంచవాద్య సంగీతం

ఈ సందర్భంగా చెన్నై డా.జె.జయలలిత మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు నాదస్వరం, వీణ, వయొలిన్, మృదంగం, కంజీరా వాద్యాలతో పంచ వాద్య సంగీతాన్ని లయబద్ధంగా ప్రదర్శించారు.

వీనులవిందుగా సాగిన ఎస్వీ సంగీత కళాశాల విద్యార్థుల లయవిన్యాసం

శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల మృదంగ విభాగాధిపతి శ్రీ ఎం.సుధాకర్ శిష్య బృందం లయవిన్యాసాన్ని వీనులవిందుగా ప్రదర్శించారు. కళాశాల గాత్ర విభాగాధిపతి డా.శబరిగిరీష్ శిష్యులైన సాయిశివశ్రవణ్ బృందం ప్రదర్శించిన గాత్ర కచేరీ ఎంతగానో ఆకట్టుకుంది. వీరితోపాటు కళాశాల గాత్ర అధ్యపకురాలు డా.కొల్లూరి వందన శిష్య బృందం గాత్ర సంగీత కార్యక్రమం ప్రేక్షకులను మైమరపింపచేసింది.

రసరిషి కేంద్రం మరియు హంపి కన్నడ యూనివర్సిటీ విద్యార్ధినీ విద్యార్ధులు ప్రదర్శించిన గాత్ర సంగీతం రక్తి కట్టించింది. కేరళలోని త్రిసూర్ కు చెందిన కౌస్తుభం డాన్స్ అకాడమీకి చెందిన శ్రీమతి సంగీత ఆధ్వర్యంలోని విద్యార్థినుల బృందం మోహిని అట్టం నృత్యాన్ని ప్రదర్శించారు. ఇందులో గజేంద్రమోక్షం, శ్రీ మహాలక్ష్మి ఆవిర్భావం తదితర ఘట్టాలను కళ్లకు కట్టేలా చక్కగా అభినయించారు. అనంతరం కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాక్షేత్రం ప్రిన్సిపాల్ డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి శిష్యులైన విద్యార్థులు భక్తప్రహ్లాద యక్షగానాన్ని అద్భుతంగా ప్రదర్శించారు.

సన్మానం

ఈ సందర్భంగా ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాల విశ్రాంత, ప్రస్తుత ఉపాధ్యాయులను సన్మానించారు. వీరిలో శ్రీ వి.సత్యనారాయణ, శ్రీ జి.లక్ష్మయ్య, శ్రీ పి.సుబ్రహ్మణ్యం, శ్రీ పి.గోవిందశెట్టి, శ్రీ మునిరత్నం తదితరులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ముఖ్య గణాంకాధికారి, కళాశాల ప్రత్యేకాధికారి శ్రీ శేషశైలేంద్ర, డీఈవో డా. భాస్కర్ రెడ్డి, ఫెడరల్ బ్యాంకు డెప్యూటీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి స్వాతిప్రియ, చీఫ్ మేనేజర్ శ్రీ విజయభాస్కర్, కళాశాల ప్రిన్సిపాల్ డా. ఉమా ముద్దుబాల, సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.