“SUMALLIKARCHANA” AT AKASHAGANGA BALANJANEYA TEMPLE _ ఆకాశగంగా శ్రీ బాలాంజనేయస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా సుమల్లికార్చన
ఆకాశగంగా శ్రీ బాలాంజనేయస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా సుమల్లికార్చన
– జపాలి తీర్థంలోని శ్రీ ఆంజనేయస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ ఈవో
– తిరుమలలో వైభవంగా హనుమజ్జయంతి వేడుకలు ప్రారంభం
తిరుమల, 2024 జూన్ 01: శ్రీ ఆంజనేయస్వామి జన్మ స్థలమైన ఆకాశగంగలో వందల సంవత్సరాల క్రితం నుండి శ్రీ అంజనాదేవి సమేత శ్రీ బాలాంజనేయస్వామివారు వెలసి ఉన్నారని, హనుమత్ జయంతి సందర్భంగా విశేష అభిషేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి.
ముందుగా ఆకాశగంగలో శ్రీ అంజనాదేవి, శ్రీ బాలాంజనేయస్వామివారికి శ్రీవారి ఆలయం నుండి విశేషమైన శేష వస్త్రాలు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి సమర్పించారు. హనుమంతుని జన్మ విశేషాలతో ప్రారంభమై, ఉపచారాలు, పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహించారు. లోక క్షేమం కొరకు స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన మల్లెలతో సహస్రనామ అర్చన నిర్వహించారు.
జపాలి తీర్థంలోని శ్రీ ఆంజనేయస్వామి….
జపాలి తీర్థంలోని శ్రీ ఆంజనేయస్వామివారికి ఈవో పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం జపాలి తీర్థం వద్ద ఈవో మీడియాతో మాట్లాడుతూ, హనుమంతుల వారు అంజనాదేవి తపోఫలితంగా వాయుదేవుని వరప్రసాదంతో అంజనాద్రిలో జన్మించారని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. హనుమజ్జయంతి సందర్భంగా హనుమ జన్మస్థానమైన ఆకాశగంగ తీర్థంలోని శ్రీ బాలంజనేయస్వామివారికి ఐదు రోజుల పాటు అభిషేకం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా నాదనీరాజనం వేదిక, ఆకాశగంగ, జపాలి ప్రాంతాల్లో ధార్మికోపన్యాసాలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు.
జూన్ 2వ తేదీ ఆదివారం ధర్మగిరి వేదపాఠశాలలో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం జరుగనుందని, హనుమంతుడు సీతాన్వేషణ కోసం లంకకు వెళ్లి సీతమ్మ జాడ తెలుసుకుని శ్రీరామచంద్రునికి తెలియేజేసే పూర్తి ఘట్టంలోని 2823 శ్లోకాలను పండితులు పారాయణం చేస్తారని చెప్పారు. హనుమంతుడు ఎలా అయితే విశ్రాంతి లేకుండా రామకార్యం కోసం వెళ్లారో అదేవిధంగా పండితులు నిరంతరాయంగా 18 గంటల పాటు పారాయణం చేస్తారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఈ మొత్తం కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందన్నారు.
జాపాలి మహర్షి త్రేతాయుగంలో ఆకాశగంగలో తపస్సు చేయడంతో హనుమంతుడు ప్రత్యక్షమై వరాలిచ్చారని, అనంతరం ఇక్కడి జాపాలి తీర్థంలో హనుమంతుని విగ్రహాన్ని మహర్షి ప్రతిష్టించారని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. ఇక్కడి స్వామివారిని, స్వామివారి జన్మస్థలమైన ఆకాశగంగలో మాతృమూర్తి శ్రీ అంజనాదేవి సమేత శ్రీ బాలాంజనేయస్వామిని భక్తులు దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
జపాలి తీర్థంలో మొదటి సారిగా మాల్ పూరి ప్రసాదం
రాష్ట్ర దేవాదాయ శాఖ కమీషనర్ ఆదేశాల మేరకు జపాలి శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో మొదటి సారిగా మాల్ పూరి ప్రసాదాన్ని విక్రయిస్తున్నట్లు హథీరాంజీ మఠం పరిపాలన ఆధికారి శ్రీ రమేష్ తెలిపారు. హనుమత్ జయంతిని సందర్భంగా శనివారం నుండి ప్రతి రోజు భక్తులకు విక్రయిస్తామన్నారు. రూ.20 విలువ గల ఈ మాల్ పూరి ప్రసాదం ఎంతో ఎంతో రుచికరంగా ఉందని, భక్తుల నుండి విశేష స్పందన వస్తోందని ఆయన చెప్పరు.
శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయంలో..
శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి మధ్యాహ్నం ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు.
ఈ కార్యక్రమాల్లో హథీరాంజీ మఠం మహంతు శ్రీ ఓం ప్రకాష్ దాస్‌జి, వైఖానస ఆగమసలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు, ఫార్‌పతేధార్ శ్రీ తులసీ ప్రసాద్, డెప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ సెల్వం, ధర్మగిరి వేద విజ్ఞన పీఠం పండితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.