ఆకాశగంగలో ఆకట్టుకున్న అన్నమయ్య సంకీర్తనలు
ఆకాశగంగలో ఆకట్టుకున్న అన్నమయ్య సంకీర్తనలు
తిరుమల, 2022 మే 26: హనుమజ్జయంతిని పురస్కరించుకుని గురువారం తిరుమలలోని ఆకాశగంగ శ్రీ బాలాంజనేయస్వామివారి ఆలయం వద్ద గల వేదికపై నిర్వహించిన అన్నమయ్య సంకీర్తనల సంగీత కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. అదేవిధంగా, నాదనీరాజనం వేదికపై ధార్మికోపన్యాసం, జపాలి తీర్థంలో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.
ఆకాశగంగలోని శ్రీ బాలాంజనేయస్వామివారి ఆలయం వద్ద ఉదయం 10 నుండి 11 గంటల వరకు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డా. చక్రవర్తి రంగనాథన్ శ్రీ హనుమ అవతార ఘట్టంపై ఉపన్యసించారు. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ ఉదయభాస్కర్, శ్రీమతి లావణ్య బృందం శ్రీ హనుమాన్ చాలీసా, శ్రీరామ, శ్రీ హనుమ సంకీర్తనలు ఆలపించారు. ఇందులో “ రామచంద్రుడితడు…”, “ఈతడు ఓ రాముడు…”, “అఖిలలోకైకవంద్య హనుమంతుడు,…” తదితర సంకీర్తనలను మనోహరంగా ఆలపించారు. మధ్యాహ్నం 12 నుండి 1 గంట వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీ వి.సురేష్‌బాబు పలు భక్తి సంకీర్తనలను రసరమ్యంగా గానం చేశారు. మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు శ్రీ వై.వేంకటేశ్వర్లు హరికథ వినిపించారు. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు బెంగళూరుకు చెందిన శ్రీ రఘురామకృష్ణ బృందం శ్రీ ఆంజనేయస్వామివారిపై సంకీర్తనలు గానం చేశారు. ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీ పురుషోత్తం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.
జపాలి శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం వద్ద ఉదయం 10 నుండి 11 గంటల వరకు బెంగళూరుకు చెందిన శ్రీ రఘురామకృష్ణ బృందం శ్రీ ఆంజనేయస్వామివారిపై సంకీర్తనలు గానం చేశారు. ఉదయం 11 నుండి 12 గంటల వరకు శ్రీ ఎం.రాముడు హరికథ వినిపించారు. మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి లావణ్య బృందం, మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీ వి.సురేష్‌బాబు బృందం పలు భక్తి సంకీర్తనలు ఆలపించారు.
నాదనీరాజనం వేదికపై రాత్రి 7 గంటలకు “సుందరే సుందరః కపిః” అనే అంశంపై డా.ఎం.పవనకుమార్ శర్మ ఉపన్యసిస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.