ఆగస్టు 11 నుండి శ్రీ వీరభద్రస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు
ఆగస్టు 11 నుండి శ్రీ వీరభద్రస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, ఆగస్టు 08, 2013: తిరుమల తిరుపతి దేవస్థానములకు అనుబంధంగా ఉన్న నారాయణవనంలోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగస్టు 11 నుండి 20వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.
ఆగస్టు 11వ తేదీ ఉదయం అంకురార్పణం, సాయంత్రం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మొదటిరోజు రాత్రి 8.00 నుండి 9.30 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6.30 నుండి 9.30 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. ఇందులో భాగంగా ఆగస్టు 12న సాయంత్రం చంద్రప్రభ వాహనం, ఆగస్టు 13న సాయంత్రం భూత వాహనం, ఆగస్టు 14న సాయంత్రం సింహ వాహనసేవలు నిర్వహిస్తారు. ఆగస్టు 15న మధ్యాహ్నం అగ్నిగుండం వెలిగిస్తారు. సాయంత్రం అగ్నిగుండ ప్రవేశం అనంతరం పులి వాహనంపై స్వామివారు విహరిస్తారు. అదేవిధంగా ఆగస్టు 16న సాయంత్రం గజవాహనం, ఆగస్టు 17న మధ్యాహ్నం రథోత్సవం అనంతరం కల్యాణోత్సవం నిర్వహిస్తారు. గృహస్త భక్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, లడ్డూ వడ ప్రసాదాలను బహుమానంగా అందజేస్తారు.
ఆగస్టు 18న ఉదయం వసంతోత్సవం, సాయంత్రం అశ్వవాహనం, ఆగస్టు 19న ఉదయం వీరఖడ్గస్నానం, మధ్యాహ్నం పల్లకీ ఉత్సవం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సాయంత్రం హరికథలు, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.