ఆగస్టు 14న శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

ఆగస్టు 14న శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి, 2012 ఆగస్టు 11: తిరుమల తిరుపతి దేవస్థానములకు అనుబంధంగా ఉన్న కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగస్టు 14వ తేదీన పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 13వ తేదీ సోమవారం అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా సోమవారం ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన, నిత్యహోమం నిర్వహించనున్నారు. అనంతరం ఆచార్య రిత్విగ్వరణం జరుగనుంది. సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు అంకురార్పణ నిర్వహించనున్నారు. ఇందులోభాగంగా మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

అదేవిధంగా మంగళవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన, నిత్యహోమం నిర్వహిస్తారు. ఉదయం 8.30 గంటల నుండి 10.00 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం 10.00 గంటల నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా జరుగనుంది. అనంతరం పవిత్ర సమర్పణ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 5.30 గంటల నుండి 7.00 గంటల వరకు స్వామివారు ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. రాత్రి 8.30 గంటల నుండి 9.00 గంటల వరకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.