ఆగస్టు 7 నుండి మెదక్ జిల్లాలో రెండు చోట్ల మహాసంప్రోక్షణం
ఆగస్టు 7 నుండి మెదక్ జిల్లాలో రెండు చోట్ల మహాసంప్రోక్షణం
తిరుపతి, 2012 ఆగస్టు 4: తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆగస్టు 7 నుండి 9వ తేదీ వరకు మెదక్ జిల్లాలోని రెండు చోట్ల గల ఆలయాల్లో మహాసంప్రోక్షణం నిర్వహించనున్నారు. జిల్లాలోని నామ్సింగ్, వెంకట్రావుపేట ప్రాంతాల్లోని ఆలయాల్లో ఈ కార్యక్రమాలు వైభవంగా జరుగ నున్నాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలు, హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
భక్తిపారవశ్యంలో ముంచెత్తిన అన్నమయ్య సంకీర్తనల గోష్టిగానం
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శనివారం ఉదయం నిర్వహించిన అన్నమయ్య సంకీర్తనల గోష్టిగానం భక్తులను ఆద్యంతం భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. అన్నమయ్య సంకీర్తనలను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలన్న సత్సంకల్పంతో తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు ప్రతి శనివారం, నెలలో శ్రవణానక్షత్రం రోజున అన్నమయ్య సంకీర్తనల గోష్టిగానం, హరికథ కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది.
ఇందులో భాగంగా ఉదయం 10.00 గంటల నుండి 11.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోష్టిగానం నిర్వహించారు. ఇందులో కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు…, నారాయణతే నమో నమో నారదసన్నుత నమో నమో…, ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు… లాంటి అన్నమయ్య సంకీర్తనలను కళాకారులు వీనులవిందుగా ఆలపించారు. ఈ కీర్తనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం 11.30 గంటల నుండి 1.00 వరకు తిరుపతికి చెందిన అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుడు శ్రీ విజయకుమార్ హరికథాగానం చేశారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ మేడసాని మోహన్, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ కె.వాణి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.