ఈనెల 30వ తేదిన రాష్ట్రములోని 108 దళితవాడలలో  కైశికద్వాదశి ఉత్సవం

ఈనెల 30వ తేదిన రాష్ట్రములోని 108 దళితవాడలలో  కైశికద్వాదశి ఉత్సవం

 తిరుపతి, అక్టోబర్‌-29, 2009: తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మప్రచారపరిషత్‌ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదిన రాష్ట్రములోని 108 దళితవాడలలో  కైశికద్వాదశి ఉత్సవం ఘనంగా నిర్వహిస్తారు.

సనాతన భారతీయ సంస్కృతిలో భక్తిభావ ప్రకటన రూపాలు బహుముఖాలు. అందులో ఆంధ్రులు రూపొందించి, మన సంస్కృతీ ప్రాభవాన్ని ఇనుమడింపజేసిన భక్తి కళారూపం ‘దాస’ భజనల కార్యక్రమంలో వచ్చిన మార్పుల వల్ల ‘మాలదాసరి’ పదం, వారు చిరంజీవం చేసిన ‘జానపధం’ ఇటీవల కాలంలో క్రమంగా తెరమరుగౌతున్న విషయం స్వవిదితమే.

దక్షిణాపథంలో వెల్లువలా వెలిగిన ‘దాస’ భక్తి కళారూపాన్ని, మాలదాసరుల సంప్రదాయ సంస్కృతీ వైభవాన్ని పునరుజ్జీవింపజేయాలనే సత్సంకల్పంతో, తితిదే ఆధ్వర్యంలో హిందూ ధర్మప్రచార పరిషత్తు ‘మంగళ కైశికద్వాదశీ’ మహోత్సవాన్ని రాష్ట్రస్థాయిలో శోభాయమాయంగా నిర్వహించాలని సంకల్పించింది.

సమాజంలో బాగా వెనుకబడిబోతున్న ‘మాలదాసరి’ భక్తి కళారూపాన్ని సవనవోన్మేషణం గావించి దాస భక్తులను చైతన్యపరచి, ఆధ్యాత్మిక జీవన స్రవంతిలో మళ్ళీ అంతర్వాహినులుగా చేయడానికి ఉద్దేశించబడిన ఉత్సవమే ‘మంగళకైశిక ద్వాదశీ’ మహోత్సవం. సామాజిక, ఆధ్యాత్మిక స్పృహను ‘దాస’ భక్తవర్గంలో ఉద్దీపింప చేయడానికి ప్రస్తుతం 30-10-2009న మన రాష్ట్రంలో అన్ని జిల్లాలలో 108 క్షేత్రాలలో ‘మంగళకైశిక ద్వాదశీ’ జరపడానికి సమాయత్తమై, దాస భక్తుల సహకారాన్ని ఆహ్వానిస్తుంది.

నేపథ్యం:

మన గ్రామీణ ప్రాంతంలో ఆదరాభిమానాలను పొందిన శ్రీహరి సంకీర్తనాపరులు, విశేషించి సంక్రాంతి పండుగ దినాలలో ‘హరిలో రంగ హరి!’ అంటూ ఇళ్ళ ముంగిళ్ళలో మంజ్గళాశాసనాలను నినదించే భాగవతోత్తములే ‘మాలదాసరులు’. ఒకనాడు ఆరాధనీయ స్థానంలో ఉండి, శ్రీ వైష్ణవ సంప్రదాయ నిష్ఠులై, చక్కని తెల్లని తిరునాక భద్రముద్రులై ప్రాత: కాలంలో శ్రీహరి గుణగానంతో గ్రామీణులను అలరించేవారు. ఈవేళ అస్తవ్యస్తంగా మారిన సామాజిక ఆర్థిక స్థితిగతుల ప్రభావం వల్ల దాస సంస్కృతి క్రమంగా వెలవెలాపోవడం గమనార్హం. వీరిని బలోపేతం చేసి, ధర్మప్రచారంలో భాగస్వాములను చేయాల్సివుంది. దీనికి తితిదే బాసటగా నిలవాలని భావించింది.

ఇతివృత్తం:

వరాహపురాణంలో ‘ఆముక్తమాల్యద’లో ప్రస్తావించబడిన స్ఫూర్తిమంతమైన ఒక ‘దాసవైభవ’ కథాంశం ఇది. తన ముగ్దమనోహర మంగళకౌశిక రాగాలాపానతో ఆ వేళ ‘మాలదాసరి’ భగవంతుడైన శ్రీవారిని మెప్పించడం, ఆపుణ్యాన్ని ఒక బ్రహ్మరాక్షసుడికి ధోరవోస్తూ, వానికి శాప విముక్తి కల్గించడం ఇందలి విశేషం.

తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ధర్మప్రచార పరిషత్తు ద్వారా దళిత వాడలలో ధర్మప్రచారం జరపాలనే భావంతో సమాహంలో అణచివేతకు గురైన వర్గాల వారికి తోడ్పాటినివ్వాలనేది యాజమాన్య సత్సంకల్పం! ఈ దిశలో చేసిన ప్రయత్నాలు ఇప్పటికే విరివిగా ప్రశంసలందుకొన్నాయి. ఇటీవల దళితవాడలో నిర్వహింపబడిన ‘శ్రీహరి కల్యాణోత్సవము’ అందరి మన్నలను పొందింది. ఈ ప్రయత్నంలో దిశలో తి.తి.దే ధర్మకర్తల మండలి తీర్మానానుసారంగా రాష్ట్రం మొత్తం 23 జిల్లాలలో జిల్లాకు 5 వాడలు చొప్పున యావత్తు ఆంధ్రరాష్ట్రమంతటా 30-10-2009న శుక్రవారం కైశికద్వాదశి కార్యక్రమాన్ని జరుప నిర్ణయించబడింది.

1. ప్రతి జిల్లాలో ఎంపికచేయబడిన 5 హరిజనవాడలలో కార్యక్రమము నిర్వహించబడుతుంది.
2. స్థానికుల ఆమోద ప్రమోదాలతో, ఆర్థిక సహకారంతో, స్థానిక భజనమండలులను చైతన్యపరచి మాలదాసరుల భాగస్వామ్యముతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.

కార్యక్రమ నిర్వహణలో ప్రతి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ముఖ్యులు, భజన మండలులు స్వచ్ఛంద సంస్థలు, భాగవతోత్తములు పాల్గొనేలా అందరిని సాదరంగా ఆహ్వానించి వారి సహకారంతో అందర్ని కలుపుకొని కార్యక్రమాన్ని సుసంపన్నంచేయాలి.

కార్యక్రమ వివరణ:
30-10-2009 శుక్రవారం
ఉదయం 9 గంటలకు – మంగళధ్వని నిత్యార్చన కార్యక్రమం
10 నుండి 11-30 – శ్రీవేంకటేశ హోమం
11-30 నుండి 12-00 – పూర్ణాహుతి
12 నుండి 1-00 వరకు – దాస భాగవతార్‌తో కథాగానం
– మంగళకైశిక ద్వాదశి వ్రతకథ
1-00 నుండి 1-30 – శ్రీ అన్నమాచార్య సంకీర్తనం (స్థానిక కళాకారులచే) గోవిందనామాలు – సమిష్టిగానం
‘మంగళకైశిక ద్వాదశి వ్రతకథ’ శ్రీవారి పుస్తక ప్రసాదంగా భక్తులకు అందించబడుతుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.