ఎస్వీ పుస్తక హుండీకి అపూర్వ స్పందన
ఎస్వీ పుస్తక హుండీకి అపూర్వ స్పందన
తిరుపతి, 2012 జూలై 07: తితిదే విద్యాసంస్థల్లో విద్య నేర్చుతున్న నిరుపేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించి వారి విద్యాభివృద్ధికి సహకరించాలన్న సదుద్దేశంతో తితిదే శ్రీ వేంకటేశ్వర పుస్తకహుండీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
విద్యాదానం యొక్క వైశిష్ట్యం బోధపడేరీతిలో తితిదే ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుండి ఇప్పటికే విశేష స్పందన లభిస్తోంది. పాత పుస్తకాలను విరాళంగా ఇవ్వాలనుకునేవారి కోసం తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో పుస్తకహుండీని ఏర్పాటుచేశారు. తితిదే ఉద్యోగులతో పాటు ఇతరులు కూడా ఈ హుండీలో పుస్తకాలు సమర్పించ వచ్చు. ఇలా వచ్చిన పాత పుస్తకాలను తరగతుల వారీగా విభజించి తితిదే విద్యాసంస్థల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ఉచితంగా అందజేస్తారు.
విద్యార్థినీ విద్యార్థులు తమకు అవసరం లేని పాత పుస్తకాలను మరొకరికి అందించడం వల్ల సాటి విద్యార్థులకు సహకరించినవారవడమే కాకుండా ఈ విద్యాదానం మూలంగా విశేష సంతృప్తి కూడా చెందుతారు. ఇలాంటి మానవీయ కార్యక్రమాలకు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రోత్సహించగలరు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.