”ఏడుకొండలవాడు…… ఎవ్వరివాడు?” అనే వార్తకు వివరణ

”ఏడుకొండలవాడు…… ఎవ్వరివాడు?” అనే వార్తకు వివరణ

విషయం :- ఈ నెల 18వ తేదిన ఆంధ్రజ్యోతి పత్రికలో ”ఏడుకొండలవాడు…… ఎవ్వరివాడు?” అనే శీర్షికతో ప్రచురించిన వార్తకు వివరణ.

ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ నెల 18వ తేదిన ”ఏడుకొండలవాడు…. ఎవ్వరివాడు?” అనే శీర్షికతో  ప్రచురించిన వార్తా కథనం నిరాధారమైన ఆరోపణలతో కూడియున్నది.

తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సేవల నిర్వహణకు, సేవాటికెట్ల పంపిణీకి కొన్ని నిర్దిష్టమైన పద్ధతులు, సంప్రదాయాలు యున్నాయి. ఆలయంలో జరిగే శ్రీవారి సేవాకార్యక్రమాలను పర్యవేక్షించడానికి ప్రపంచ ప్రసిద్దిగాంచిన జియ్యరు వ్యవస్థ, ఆగమశాస్త్ర సలహా కమిటి, అదేవిధంగా సేవా టికెట్ల పంపిణీని పర్యవేక్షించి, తగు చర్యలు తీసుకోవడానికి పటిష్ఠమైన విజిలెన్స్‌ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. అధికారులు విచక్షణ కోటాకింద పంపిణీ చేసే సేవా టికెట్లను కూడా కొన్ని నిర్దిష్టమైన విధానాలకు లోబడి పంపిణీచేయడం జరుగుచున్నది. సమాజంలో గౌరవస్థానంలోయున్న మంత్రివర్యులు, పాలకమండలి సభ్యులు, సీనియర్‌ ఆధికారులు, విలేకరులు మొదలగువారు సిఫారసు చేసిన వ్యక్తులకే లభ్యతనుబట్టి సేవాటికెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. విచక్షణ కోటాకింద విచక్షణా రహితంగా సేవా టికెట్లు పంపిణీ చేస్తున్నారని పేర్కొనడం పూర్తిగా అవాస్తవం.

అర్చనానంతర దర్శన టికెట్లు రోజుకు 8వేల వరకు పంపిణీ చేస్తారని, అందులో 5వేల వరకు కేవలం సిపారసు ద్వారా మాత్రమే పంపిణీ చేస్తారని పేర్కొనడం పూర్తిగా అవాస్తవం. ఎ.ఎ.డి టికెట్లు ఆరోజుయున్న రద్దీని బట్టి పంపిణీచేయడం జరుగుతుంది. రద్దీ ఎక్కువగావుంటే 3వేల నుండి 4వేల వరకు, సాదారణ భక్తుల సంఖ్య తక్కువగాయుంటే 5 నుండి 6వేల వరకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఏరోజుకారోజు విజయబ్యాంకు ద్వారా దాదాపు 2వేల ఎ.ఎ.డి టికెట్లు, మరో నాలుగు వందలు అడ్వాన్సు బుక్కింగు ద్వారా, ఐదువందలు ఈసేవా, ఇంటర్‌నెట్‌ ద్వారా, 150 టికెట్లను టూరిజం డిపార్టుమెంటు ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం జనవరి నెల నుండి దాదాపు మొత్తం ఎ.ఎ.డి టికెట్లను విజయబ్యాంకు ద్వారానే భక్తులకు అందజేయడం జరుగుచున్నది. కాబట్టి వీటిని ”విచ్చలవిడిగా” పంపిణీ చేస్తున్నారని పేర్కొనడం పూర్తిగా సత్యదూరం.

సుప్రభాతం, తోమాల, అర్చన సేవా టికెట్లనుకూడా కొన్ని నిబంధనలు, పద్దతులను అనుసరించే పంపిణీచేయడం జరుగుచున్నది. అదేవిధంగా, వి.ఐ.పి బ్రేక్‌ దర్శనానికి కేవలం 500ల మందిని మాత్రమే అనుమతించడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు, ఇతర ముఖ్యమైన ఉత్సవాలు, భక్తుల రద్దీ ఎక్కువగాయున్న అనేక సందర్భాలలో బ్రేక్‌ దర్శనాన్ని పూర్తిగా రద్దుచేయడం జరుగుతుంది. ప్రతిరోజు నాలుగువేల మందిని వి.ఐ.పి దర్శనానికి అనుమతిస్తారని పేర్కొనడం పూర్తిగా అవాస్తవం. కొన్ని నిర్దిష్టమైన సంప్రదాయాలు, నిబంధనల ప్రకారమే విచక్షణ కోటాకింద టికెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. వీటిలో లోటుపాట్లు జరిగితే చట్టప్రకారం చర్యలుకూడా తీసుకోవడం జరుగుతుంది. ఒక మహిళ టికెట్టు లేకుండా సేవలో పాల్గొంటున్నదని పేర్కొనడంకూడా పూర్తిగా అవాస్తవం.

ఈ వివరణను ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రముఖంగా ప్రచురించాలని మనవి చేయుచున్నాము.

కె.రామపుల్లారెడ్డి
తి.తి.దే, ముఖ్య ప్రజాసంబందాధికారి