ఏప్రిల్ 15 నుండి శ్రీ అగస్తీశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
ఏప్రిల్ 15 నుండి శ్రీ అగస్తీశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, ఏప్రిల్ 15, 2013: నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మరగదవల్లీ సమేత అగస్తీశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 15 నుండి 26వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు గణపతిపూజ నిర్వహించనున్నారు. రాత్రి 7.30 గంటల నుండి 8.30 గంటల మధ్య అంకురార్పణం జరగనుంది.
ఏప్రిల్ 16వ తేదీ ఉదయం 6.00 గంటలకు మేష లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. అదేరోజు రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై అగస్తీశ్వరస్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రతిరోజూ ఉదయం 10.00 గంటల నుండి 11.00 గంటల మధ్య స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. సాయంత్రం స్వామివారి వాహనసేవ ఉంటుంది.
ఏప్రిల్ 17వ తేదీ సింహ వాహనం, ఏప్రిల్ 18న హంస వాహనం, ఏప్రిల్ 19న శేషవాహనం, ఏప్రిల్ 20న నంది వాహనం, ఏప్రిల్ 21న గజ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఏప్రిల్ 22న రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. ఏప్రిల్ 23న సాయంత్రం 7.00 నుండి 8.00 గంటల వరకు కల్యాణోత్సవం, అనంతరం అశ్వవాహన సేవ జరుగనున్నాయి. రూ.500/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ, అన్నప్రసాదాలను బహుమానంగా అందజేస్తారు.
ఏప్రిల్ 24న ఉదయం శ్రీ నటరాజస్వామి వీధి ఉత్సవం జరుగనుంది. సాయంత్రం రావణేశ్వర వాహనంపై అగస్తీశ్వరస్వామి దర్శనమిస్తారు. ఏప్రిల్ 25న కైలాసకోనలో త్రిశూలస్నానం ఘనంగా నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఏప్రిల్ 26న సాయంత్రం 5.00 నుండి 7.00 గంటల వరకు పుష్పయాగం కన్నులపండువగా జరుగనుంది. ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ కోలాటం, ఆధ్యాత్మిక, భక్తిసంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఆలయ చరిత్రను పరిశీలిస్తే నారాయణవనం ప్రాంతాన్ని పరిపాలించిన శ్రీ పద్మావతీదేవి తండ్రి అయిన శ్రీ ఆకాశ మహారాజు పితామహులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ శ్రీ అగస్తీశ్వరస్వామివారు స్వయంభువుగా వెలిశారు. స్వామివారి లింగాకారానికి పీఠభాగం అనగా బాణపట్టమును అమర్చి వేద ఆగమశాస్త్ర ప్రకారం శ్రీ అగస్త్య మహర్షులవారు ప్రతిష్ఠ చేసి పూజించినందువల్ల స్వామివారికి అగస్తీశ్వరస్వామి అని పేరు వచ్చింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.