ఏప్రిల్‌ 17 నుండి కార్వేటినగరం శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు

ఏప్రిల్‌ 17 నుండి కార్వేటినగరం శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు

తిరుపతి, ఏప్రిల్‌ 16, 2013: ఏప్రిల్‌ 19వ తేదీన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని తితిదేకి అనుబంధంగా ఉన్న కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పరిధిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 17వ తేదీ నుండి మూడు రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుండి 10.30 గంటల వరకు శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవార్లకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు ఊంజలసేవ నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 17వ తేదీన సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు తిరుచ్చిపై స్వామివారికి తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు. రెండవ రోజు ఏప్రిల్‌ 18వ తేదీ రాత్రి 6.30 గంటల నుండి 8.30 గంటల వరకు శ్రీరాములవారు కల్పవృక్ష వాహనంపై విహరించనున్నారు.

ఏప్రిల్‌ 19వ తేదీ శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని ఉదయం 7.30 గంటల నుండి 10.00 గంటల వరకు శ్రీ కోదండరాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమంత వాహనంపై తిరువీధులలో విహరిస్తూ భక్తులకు అభయమిస్తారు. అనంతరం ఉదయం 11.00 నుండి 12.00 గంటల వరకు శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 5.00 నుండి 6.30 గంటల వరకు కన్నులపండుగగా శ్రీ సీతారాముల కల్యాణోత్సవం జరుగనుంది.

గృహస్థభక్తులు రూ.500/- చెల్లించి పాల్గొనవచ్చును. వీరికి ఒక ఉత్తరీయం, ఒక జాకెట్టు, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు. రాత్రి 7.30 నుండి 9.30 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.

ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ సాయంత్రం హరికథ, అన్నమాచార్య సంకీర్తనలు, పండరి భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.