ఏఫ్రిల్ 7వతేది నుండి 9వ తేది వరకు వసంతోత్సవం
ఏఫ్రిల్ 7వతేది నుండి 9వ తేది వరకు వసంతోత్సవం
తిరుమల, ఏఫ్రిల్-1, 2009: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఏఫ్రిల్ 7వతేది నుండి 9వ తేది వరకు మూడురోజుల పాటు వసంతోత్సవం వైభవంగా నిర్వహిస్తారు.
ఈ ఉత్సవంలో పాల్గొనదలచిన భక్తులు మూడురోజులలో ఏదేని ఒక్కరోజుకుగాను రూ.3000/- చెల్లించి పాల్గొనవచ్చును. ఒక టిక్కెట్టుపై 10మందిని శ్రీవారిదర్శనానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారిఆలయంలో తోమాలసేవ, అర్చన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవలను రద్దుచేశారు.
ఈఉత్సవంలో ప్రతిరోజు మధ్యాహ్నం 2గంటలకు వైభవోత్సవ మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అదేవిధంగా రెండవరోజున ఉదయం 9గంటలకు స్వర్ణరథంపై స్వామివారు ఉభయనాంచారులతో తిరువీధులలో ఊరేగుతారు. ఇదేరోజున సాయంత్రం 6గంటలకు వైభవోత్సవ మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. మూడవరోజు ఉదయం 8.30గంటలకు ఉభయనాంచారులతో కూడిన శ్రీమలయప్పస్వామివారు, శ్రీరామ, లక్ష్మణ, సీత, ఆంజనేయస్వామివారు, శ్రీకృష్ణస్వామివారు, శ్రీరుక్మిణి అమ్మవార్లను శ్రీవారి ఆలయం నుండి ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి తీసుకువస్తారు. అనంతరం ఆస్థానం నిర్వహిస్తారు. ఆలయంలో ఈ రోజు నిర్వహించాల్సిన తిరుప్పావడసేవను రద్దుచేశారు. సాయంత్రం 7గంటలకు ఆలయంలోని శ్రీభాష్యకార్లవారి ముఖమండపం వద్ద ఆస్థానం నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.