కర్నాటక రాష్ట్రములోని అర్చకులకు పునశ్శరణ తరగతులు
కర్నాటక రాష్ట్రములోని అర్చకులకు పునశ్శరణ తరగతులు
తిరుపతి మార్చి-7,2009: శ్వేత కార్యక్రమాల్ని జాతీయస్థాయికి తీసుకొచ్చే క్రమములో భాగంగా మొదటి సారిగా కర్నాటక రాష్ట్రములోని అర్చకులకు పునశ్శరణ తరగతులు నిర్వహించడం జరిగిందని తి.తి.దే. కార్యనిర్వహణాధికారి డా|| కె.వి. రమణాచారి చెప్పారు.
శనివారం సాయంత్రం శ్వేత నందు మొదటి విడత కర్నాటక రాష్ట్రం నుండి వచ్చిన అర్చకులకు నిర్వహించిన పునశ్శరణ తరగతుల ముగింపు సమావేశానికి అయన ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఇ.ఓ. మాట్లాడుతూ అర్చకుల ద్వారా సమాజంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అర్చక స్వాములందరూ ఈ సమాజం బాగుండాలని కోరుకుంటున్నంత కాలం అర్చకులందరికీ గౌరవం ఉంటుందని తెలిపారు. ఈ రోజుల్లో ఏ వ్రతాలు చేయాలన్న క్యాసెట్లు అందుబాటులోకి వచ్చాయని, అయితే అర్చకులు స్వతహాగా చెప్పగలిగితే అది ఎంతో ఆనందదాయక విషయమని ఇ.ఓ. అన్నారు. మనిషి జీవించినంతకాలం విద్యార్థియేనని, ప్రతి నిత్యం సరిక్రొత్త విషయాలు తెలుసుకోవాలని, ఇక్కడ నేర్చుకొన్న విషయాలు ఆచరణసాధ్యం చేయడానికి కృషిచేయాలని తెలిపారు.
2007, జూలై 7వ తేదిన ప్రారంభమైన ఈ శిక్షణాతరగతుల ద్వారా ఇప్పటికే వందలాది మంది అర్చకులు శిక్షణ పొందినారని, ఇంకను ఇతర రాష్ట్రలనుండి కూడా అర్చకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
అనంతరం ఆయన 42 మంది అర్చక స్వాములకు శ్రీవారి చిత్రపటాలు, పూజా సామాగ్రి, వస్త్రములు, పుస్తకాలు, సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ కార్యక్రమములో శ్వేత డైరెక్టర్ శ్రీ భూమన్, స్థానికాలయాల ఆగమ సలహాదారు డా|| వేదాంత విష్ణుభట్టాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.