కాలినడక భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం
కాలినడక భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం
తిరుపతి, మార్చి-31, 2009: తిరుపతి అలిపిరి దగ్గర నుండి కాలినడకన నడిచి వెళ్ళి తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునే వేలాది మంది భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యంకల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానములు కొన్నినెలల నుండి ప్రత్యేక కృషి సల్పుతోంది. ఈ బృహత్తర కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు,యిబ్బందులు లేకుండా విజయవంతం కావాలంటే, ముందుగానే అవసరమైన కంప్యూటర్ ‘సాప్టువేర్’, కాలినడక దారిలో ప్రత్యేక కౌంటర్లు, వైకుంఠం -|| లో ప్రత్యేక కాంపార్ట్‌మెంట్లు సిద్దం చేసుకోవాల్సియుంది.
కాలినడకన వెళ్ళే భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించడానికి తితిదే పాలకమండలి అనుమతి తెల్పిన తర్వాత తి.తి.దే కార్యనిర్వహణాధికారి శ్రీకె.వి.రమణాచారి, తిరుమల ప్రత్యేకాధికారి శ్రీఎ.వి.ధర్మారెడ్డి సంబంధితశాఖాధికారులతో పలుదఫాలుగా చర్చలు జరిపారు. అలిపిరి నుండి కాలినడకన వెళ్ళేదారిలో గాలిగోపురం దగ్గర రెండు ప్రత్యేక కౌంటర్లు, అదేవిధంగా యాత్రికుల వసతి సదుపాయం కాంప్లెక్సు-|| లో కూడా మరో రెండు ప్రత్యేక కౌంటర్లు, వైకుంఠం-|| లో కూడా ఒక కౌంటరు యేర్పాటుచేయాలని నిర్ణయించారు.
కాలినడకన వెళ్ళే భక్తులకు గాలిగోపురం దగ్గర ప్రత్యేకంగా యేర్పాటు చేసిన రెండు కౌంటర్లలో బయోమెట్రిక్ పద్దతిలో చేతివేలిగుర్తులు, ఫోటోలు తీసుకొని, వారికి అన్నివివరాలతో కూడిన ఒక రశీదు అందజేస్తారు. భక్తులు ఈ రశీదును పిఎసి-||లో చూపించి అక్కడ అవసరమైతే లాకర్, వసతి సౌకర్యం, ఉచిత భోజన సౌకర్యం పొందవచ్చు. అంతేగాకుండా, భక్తులు అక్కడే తలనీలాలు సమర్పించడానికి కూడా ప్రత్యేక సౌకర్యం కల్పిస్తున్నారు. భక్తులు గాలిగోపురం దగ్గర కంప్యూటర్లో తీసుకున్న ”స్లిప్పు”కు 24 గంటలు చెల్లుబడి యుంటుంది.
కాలినడకన వచ్చిన భక్తులకు వైకుంఠం-|| లో కొన్ని కంపార్టుమెంటులను రిజర్వు చేయడం జరిగింది. అక్కడ బయోమెట్రిక్ సిస్టమ్‌లో భక్తులను పరిశీలించి, కాలినడకన వచ్చిన భక్తులను వాటిలోకి అనుమతించడం జరుగుతుంది. వీరికి అతి తక్కువ సమయంలోనే దర్శనం కల్పించడానికి దేవస్థానం అన్ని యేర్పాట్లు చేసింది.
కాలినడకన వెళ్ళే భక్తులు గాలిగోపురం దగ్గర కంప్యూటర్లలో ప్రత్యేక ”స్లిప్పు”లు తీసుకున్న తర్వాత 7 లేక 8 గంటలలోపే వారికి దర్శనం కల్పించడానికి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది.
ఈలోపల వారు తలనీలాలు సమర్పించడానికి, స్నానాలు చేయడానికి పిఎసి-||లో అన్ని ఏర్పాట్లు అధికార్లు పూర్తిచేశారు. అంతేకాకుండా, వీరికి పిఎసి-||లోనే ఉచిత భోజన సౌకర్యం కల్పించడం జరుగుతుంది.
ఈ బృహత్తర కార్యక్రమాన్ని శ్రీరామనవమి పర్వదినాన ఏఫ్రిల్ 3వ తేదిన ప్రారంభించడానికి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అంతేకాకుండా, యీ కార్యక్రమాన్ని కొన్ని నెలలపాటు అన్నికోణాలలో పరిశీలించిన తర్వాత, కాలినడకన వెళ్ళే భక్తులకు అదనపు వసతిసౌకర్యం, ప్రత్యేక సేవలటికెట్లు కల్పించడానికి కూడా పరిశీలన జరుపుతామని శ్రీకె.వి.రమణాచారి తెలిపారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.