ATTAINING SALVATION THROUGH METLOTSAVAM – SEER _ జీవనప్రగతి సాధనే మెట్లోత్సవం అంతరార్థం : శ్రీశ్రీశ్రీ సుబుదేంద్రతీర్థ స్వామీజీ వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం
Tirupati, 7 Nov. 19: The ultimate goal of Metlotsavam is attaining salvation, said HH Sri Subudendra Theertha Swamy of Mantralaya.
Speaking on the occasion of Metlotsavam held at Alipiri Padala Mandapam on Thursday, the Chief Pontiff of Sri Raghavendra Mutt said, selfless devotion is the means to attain Mukthi.
The Dasa Sahitya Project Special Officer Sri PR Anandatheerthacharyulu, over 3000 bhajan members took part.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జీవనప్రగతి సాధనే మెట్లోత్సవం అంతరార్థం : శ్రీశ్రీశ్రీ సుబుదేంద్రతీర్థ స్వామీజీ
వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం
నవంబరు 07, తిరుపతి, 2019: ధర్మమార్గంలో నడుస్తూ జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ భగవంతుడిని చేరుకోవడమే మెట్లోత్సవం అంతరార్థమని మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సుబుదేంద్రతీర్థ స్వామీజీ ఉద్ఘాటించారు. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం గురువారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. శ్రీశ్రీశ్రీ సుబుదేంద్రతీర్థ స్వామీజీ, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్.ఆనందతీర్థాచార్య ముందుగా మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ సుబుదేంద్రతీర్థ స్వామీజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ రంగాల్లో వృద్ధి చెందుతూ ఉన్నతికి చేరుకోవాలన్నారు. శక్తివంచన లేకుండా భక్తితో ప్రయత్నిస్తే భగవంతుని అనుగ్రహం తప్పక కలుగుతుందన్నారు. బ్రహ్మముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు.
దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్.ఆనందతీర్థాచార్య మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహిస్తున్నట్టు చెప్పారు. భజన మండళ్ల సభ్యులకు టిటిడి మూడో సత్రం ప్రాంగణంలో ధార్మిక శిక్షణ, హరిదాస కీర్తనల్లో అంత్యాక్షరి, దాస సాహిత్యంలో రసప్రశ్నల స్పర్థ, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించినట్టు వివరించారు. ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ తమ ప్రాంతాలకు వెళ్లి భక్తజనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇస్తారని తెలియజేశారు.
అంతకుముందు భజనమండళ్ల భక్తులు టిటిడి మూడో సత్రం ప్రాంగణం నుండి అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు. అనంతరం పాదాలమండపం వద్ద సంప్రదాయబద్ధంగా మెట్లపూజ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 2500 మందికిపైగా భక్తులు భజనలు చేసుకుంటూ తిరుమలగిరులను అధిరోహించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.