జూన్ 18న టిటిడి కాంట్రాక్టు కార్మికుల స‌మ‌స్య‌ల‌పై నివేదిక – జెఈవో

జూన్ 18న టిటిడి కాంట్రాక్టు కార్మికుల స‌మ‌స్య‌ల‌పై నివేదిక – జెఈవో

తిరుమల, 2010 జూన్ 10: తిరుమల నిర్వాసితులు, వైకుంఠం వెండార్స్‌, పీస్‌రేట్‌ బార్బర్స్‌, ఫారెస్ట్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు పాలకమండలి సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ జూన్‌ 18వ తేది తిరుమలలో నిర్వహించనున్న పాలకమండలి సమావేశానికి తమ నివేదికను సమర్పించనున్నారని తిరుపతి జె.ఇ.ఓ డా||యన్‌.యువరాజ్‌ తెలిపారు.
 
పాలకమండలి సభ్యులు శ్రీముత్యంరెడ్డి, డా||యం.అంజయ్య, శ్రీ సత్యనారాయణ, శ్రీ ఆలూరి సుబ్రమణ్యంలతో, తిరుపతి జె.ఇ.ఓ డా||యన్‌.యువరాజ్‌ కన్వీనర్‌గా కమిటీ ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ కమిటీ పై తెల్పిన కార్మికుల సమస్యలను కూలంకషంగా చర్చించి ఒక నివేదికను పాలకమండలికి సమర్పించనున్నది.
 
అదేవిధంగా తితిదేలోని పలు విభాగాలలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు కనీసవేతనాలను చెల్లిస్తున్నామని, పురాణపండితులకు కనీసవేతనాలకు సంబంధించి తితిదే పాలకమండలి నిర్ణయాన్ని ప్రభుత్వానికి పంపినట్లు ఆయన తెలిపారు.
 
తిరుమల నిర్వాసితులు, వైకుంఠం వెండార్స్‌, పీస్‌రేట్‌ బార్బర్స్‌, ఫారెస్ట్‌ కార్మికుల సమస్యలపై రాబోయే పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు కనుక వీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.