జూలై 14 నుండి 16వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు

జూలై 14 నుండి 16వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు

తిరుపతి, 2012 జూలై 13: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు జూలై 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. శుక్రవారం సాయంత్రం అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

మొదటి రోజైన శనివారం ఉదయం శ్రీ కోదండరామస్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి మూలవర్ల తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం స్నపనతిరుమంజనం వేడుకగా జరుగనుంది. సాయంత్రం 5.00 గంటల నుండి 6.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం, భాష్యకార్ల గుడి వద్ద యిహల్‌ శాత్తుమొర నిర్వహించనున్నారు. రాత్రి 7.00 గంటల నుండి 9.00 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ చేయనున్నారు.

రెండో రోజైన ఆదివారం ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించనున్నారు. అనంతరం స్నపనతిరుమంజనం వేడుకగా జరుగనుంది. ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు పవిత్ర సమర్పణ చేయనున్నారు. సాయంత్రం 5.00 గంటల నుండి 6.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం, భాష్యకార్ల గుడి వద్ద యిహల్‌ శాత్తుమొర నిర్వహించనున్నారు. రాత్రి 7.00 గంటల నుండి 9.00 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.

పవిత్రోత్సవాల్లో చివరి రోజైన సోమవారం ఉదయం శ్రీ కోదండరామస్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించనున్నారు. అనంతరం స్నపనతిరుమంజనం వైభవంగా జరుగనుంది. సాయంత్రం 4.00 గంటల నుండి 5.00 గంటల వరకు స్వామివార్లకు వస్త్ర బహుమానం, అక్షతారోహణ, ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు.  సాయంత్రం 5.00 గంటల నుండి 6.00 గంటల వరకు తిరువీధి ఉత్సవం, భాష్యకార్ల గుడి వద్ద యిహల్‌ శాత్తుమొర నిర్వహిస్తారు. రాత్రి 7.00 గంటల నుండి 9.00 గంటల వరకు ఆల యంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. అనంతరం నిర్వహించే పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

ప్రపంచశాంతికి, సకల దోషాల నివారణకు, అన్ని యజ్ఞాలు చేసిన ఫలాన్ని పొందేందుకు ఆలయంలో ప్రతిఏటా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక రవికె, ఉత్తరీయం, ఒక పవిత్ర మాలను బహుమానంగా అందజేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.