జూలై 17న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో అణివార ఆస్థానం

జూలై 17న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో అణివార ఆస్థానం

తిరుపతి, 2010 జూన్ 20: తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదిన ఆణివార ఆస్థానం జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీవారికి నిత్యం నిర్వహించే ఆర్జితసేవలైన తోమాల,అర్చన, కల్యాణోత్సవం, ఊంజల సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేస్తారు.  

ఆణివార ఆస్థానం రోజు పుష్పపల్లకీ ఉత్సవం నిర్వహిస్తారు. ఈఉత్సవంలో పాల్గొనదలచిన వారు 1000 చెల్లించి పాల్గొనవచ్చును.

ప్రతి సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలం, కర్కాటక సంక్రాంతి రోజున శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం అనే ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పూర్వం దేవస్థానం వారు ఆదాయవ్యయాలు, నిలువలు, మున్నగు సంవత్సర లెక్కలు ఈ ఆణివార ఆస్థానం రోజున ప్రారంభమయ్యేవి.

ఆ రోజు ఆలయంలోని బంగారు వాకిలి ముందు సర్వభూపాల వాహనంలో శ్రీదేవి, భూదేవులతో శ్రీమలయప్పస్వామి వారిని వేంచేపు చేస్తారు. మరొక పల్లకిపై విష్వక్సేనులవారిని వేంచేపు చేసిన పిదప ఘనంగా వస్త్రసమర్పణ, నివేదనలు జరుగుతాయి.

అనంతరం అక్షతారోపణ జరిగిన తర్వాత కార్యనిర్వహణాధికారికి దేవస్థానం బీగాలగుత్తిని తగిలించి హారతి, శఠారులను ఇస్తారు. ఆ తర్వాత ప్రసాద వితరణ జరుగుతుంది.

బంగారు వాకిలి ముందు జరిగే ఆణివార ఆస్థానంలో అర్చకులు, జియ్యంగార్లు, అధికారులు, దేవస్థానం ఉద్యోగులు మాత్రమే పాల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.