తితిదే ఉపాధ్యాయులు సంస్థ ప్రతిష్టను ఇనుమడింపచేయాలి : తిరుపతి జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి

తితిదే ఉపాధ్యాయులు సంస్థ ప్రతిష్టను ఇనుమడింపచేయాలి : తిరుపతి జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి

తిరుపతి, సెప్టెంబరు 05, 2013: తితిదే విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులు నాణ్యమైన బోధనా ప్రమాణాలు పాటించి సంస్థ ప్రతిష్టను మరింత ఇనుమడింపచేయాలని తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. సెప్టెంబరు 5న గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని తితిదే విద్యా విభాగం ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో గురువారం తితిదే ప్రధానోపాధ్యాయులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ విద్యార్థులను భావిభారత పౌరులుగా తయారు చేయడంలో డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఉపాధ్యాయులందరికీ ఆదర్శప్రాయులన్నారు. రాధాకృష్ణన్‌ తన రచనలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులను ప్రభావితం చేసినట్టు తెలిపారు. ఉపాధ్యాయులు లోతుగా అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు నూతన పద్ధతుల్లో విద్యార్థులకు బోధన అందించాలని సూచించారు.

అనంతరం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి పి.జ్యోతి, ఎస్వీ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు కె.కృష్ణమూర్తి, శ్రీ కోదండరామస్వామి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ టి.మునిరత్నంనాయుడు, శ్రీ పద్మావతి బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి సరళాదేవి, ఎస్వీ ఓరియంటల్‌ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు శ్రీ బి.ఎస్‌.ఆర్‌.శర్మ, తాటితోపులోని శ్రీ కపిలేశ్వరస్వామి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి గీతాంజలి, ఎస్వీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కృష్ణయ్య, ఎస్వీ బధిర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి నళిని, తిరుమలలోని ఎస్వీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ సురేంద్ర, ఎస్వీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కిషన్‌ను జెఈవో శాలువ, శ్రీవారి చిత్రపటంతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో తితిదే విద్యాశాఖ అధికారి శ్రీ పి.వి.శేషారెడ్డి, సలహాదారు శ్రీ అప్పారావు, రిటైర్డ్‌ డి.ఇ.ఓ శ్రీ రెడ్డిప్రకాష్‌, విద్యాసంస్థల ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
              
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది