తిరుపతిలో వెంగమాంబ 293వ జయంతి ఉత్సవాలు ప్రారంభం

వెంగమాంబ సాహిత్యంలో ఆధ్యాత్మిక శక్తి తరంగాలు : ఆచార్య యువశ్రీ

– తిరుపతిలో వెంగమాంబ 293వ జయంతి ఉత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2023 మే 04: శ్రీవారి భక్తురాలైన వెంగమాంబ తన సాహిత్యం ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మిక శక్తి తరంగాలను వ్యాప్తి చేశారని శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఆచార్యులు యువశ్రీ తెలియజేశారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో వెంగమాంబ 293వ జయంతి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సులో ఆచార్య యువశ్రీ “మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ – జీవన గానం” అనే అంశంపై మాట్లాడారు.వెంగమాంబ రచనల్లో మహిళలకు ఉన్నత స్థానం కల్పించారన్నారు. ధైర్య , సాహసాల్లో పురుషుల కంటే మహిళలు ఎక్కువ అని తన రచనల ద్వారా నిరూపించారని తెలిపారు. ఆమె జీవిత విశేషాలను, బృందావనం విశిష్టత ను సోదాహరణంగా తెలిపారు. మానవ జీవిత లక్ష్యం పరమాత్మ సాక్షాత్కారమని తెలిపారు. వెంగమాంబ రచనల్లో ప్రాచీన సాహిత్యంలో ఆనాటి సామాజిక, భాషా, సాంస్కృతిక విశేషాలు తెలుసుకోవచ్చన్నారు. ఆమె బాల్యం నుండి ఆధ్యాత్మికత, స్వతంత్రంగా సాహిత్య రచన చేసిన స్త్రీమూర్తి అని, శివవైష్ణవులపై సమభావంతో రచనలు చేశారని వివరించారు. ప్రతి స్త్రీ వెంగమాంబ తత్వాన్ని అలవర్చుకుంటే నేటి సమాజంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించవచ్చని వివరించారు.

అంతకుముందు సదస్సుకు అధ్యక్షత వహించిన శ్రీ సొరకాయల కృష్ణారెడ్డి “మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ – దాన శాసనాలు” అనే అంశంపై మాట్లాడారు . అన్ని వర్గాల ప్రజలు అర్థం చేసుకునేందుకు వీలుగా జనరంజకమైన భాషలో వెంగమాంబ రచనలు చేశారని తెలిపారు. వెంగమాంబ గద్యం, పద్యం, యక్షగానాల రచన ద్వారా భక్తిని చాటుకున్నారని వివరించారు. వెంగమాంబ మొత్తం 18 రచనలు చేయగా, ఇందులో శ్రీ వేంకటాచల మహత్యం గ్రంథం చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.

అనంతరం ఎస్వి మ్యూజియం ఓఎస్డీ శ్రీ కృష్ణారెడ్డి ‘తరిగొండ వెంగమాంబ – సాహిత్యం – ప్రత్యేకత ” అనే అంశంపై ప్రసంగించారు. వెంగమాంబ రచనల్లో వైవిధ్యం మెండుగా ఉంటుందన్నారు. వివిధ సాహిత్య ప్రక్రియలలో 18 గ్రంథాలను రచించిన మొదటి తెలుగు కవయిత్రి ఆమే నన్నారు.

తన రచనల్లో సకల సిద్ధాంతాలను ఆకళింపు చేసుకుని తాత్వికతను లోకానికి అందించినట్లు తెలిపారు.

సాయంత్రం 6.30 గంటలకు తిరుపతికి చెందిన డా.శ్యాంకుమార్ , శ్రీమతి తేజోవతి బృందం సంగీత సభ జరుగనుంది.

ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ విభీషణ శర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.