తిరుమలలో గోవింద ఎంఎస్ఆర్ విశ్రాంతి గృహాన్ని ప్రారంభించిన టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

తిరుమలలో గోవింద ఎంఎస్ఆర్ విశ్రాంతి గృహాన్ని ప్రారంభించిన టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

 తిరుమల, 2022 నవంబరు 28: తిరుమలలో విద్యుత్ భవనం వద్ద నూతనంగా నిర్మించిన గోవింద ఎంఎస్ఆర్ విశ్రాంతి గృహాన్ని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బెంగళూరుకు చెందిన దాత శ్రీ ఎంఆర్.సీతారాం సుమారు రూ.7 కోట్ల వ్యయంతో ఈ విశ్రాంతి గృహాన్ని నిర్మించారు.

ఈ సందర్భంగా శ్రీ వైవి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో భక్తులకు వసతి సౌకర్యం పెంచేందుకు వీలుగా డోనార్ బిడ్డింగ్ విధానం ద్వారా 13 వసతిగృహాల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్టు చెప్పారు. గత ప్రభుత్వ విధానాలకు స్వస్తిపలికి పూర్తి పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా వసతి గృహాల నిర్మాణాన్ని దాతలకు అప్పగించినట్లు తెలియజేశారు. మొత్తం 13 వసతి గృహాల నిర్మాణం ద్వారా 170 గదులు భక్తులకు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. కరోనా సమయంలో భక్తుల రాక తక్కువగా ఉన్న సమయంలో గదుల మరమ్మతులు, నూతన వసతి గృహాల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గత ఆరు నెలల కాలంలో పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించి ఈ వసతి గృహాలను డిసెంబర్ లోపు పూర్తి చేయాలని దాతలకు సూచించామన్నారు. శ్రీ సీతారాం వేగవంతంగా ఈ వసతి గృహాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా దాత శ్రీ సీతారాం కుటుంబ సభ్యులకు ఛైర్మన్ కృతజ్ఞతలు తెలియజేశారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.