తిరుమలలో ఘనంగా పార్వేటు ఉత్సవం
తిరుమలలో ఘనంగా పార్వేటు ఉత్సవం
తిరుమల, 15 జనవరి – 2013: శ్రీశేషశైలమునందు అర్చావతారములో వేంచేసివున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారికి పార్వేటి ఉత్సవము మకరసంక్రమునకు మరుసటిరోజున అనగా కనుమ పండుగనాడైన జనవరి 16న అత్యంత ఘనంగా జరిగింది. అదేరోజున గోదాపరిణయోత్సవం కూడా కన్నుల పండుగగా జరిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని ఆండాళ్ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. ఈ మాలలను శ్రీవారి మూల మూర్తికి అందంగా అలంకరించారు.
మంగళవారం స్వామివారికి ప్రాతఃకాలారాధన పూర్తియిన తరువాత శ్రీ మలయప్పస్వామివారు వెండి తిరుచ్చిలో వేంచేసారు. వెంటనే ప్రదక్షిణములేకనే పార్వేట మండపమునకు వెళ్ళి, ఆ మండపమునందు పుణ్యాహము జరిగిన పిమ్మట మంచెలో వేంచేసారు. శ్రీస్వామివారికి ఆరాధనము, నివేదనము జరిగి హారతులు అయిన పిమ్మట ఉభయదార్లకు తాళ్ళపాకంవారికి, మఠంవారికి మర్యాదలు ్ణస్వామివారు మండపమును వదలి ప్రాంగణమునకు వచ్చారు.
శ్రీకృష్టస్వామివారిని మాత్రము సన్నిధి గొల్లపూజ చేసిన చోటుకు వేంచేపుచేసి పాలువెన్న ఆరగింపు అయి హారతి జరిగిన పిమ్మట శ్రీమలయప్పస్వామివారి సన్నిధికి వెళ్ళారు. తరువాత ఆ గొల్ల సమర్పించిన పాలు వెన్న శ్రీమలయప్పస్వామివారికి నివేదనము హారతి అయి గొల్లకు బహుమానము జరిగింది. తరువాత శ్రీమలయప్పస్వామివారు ముందునకు కొంత దూరము పరుగెత్తి వారి తరపున అర్చకులు బాణమువేసిన పిమ్మట వెనుకకు వచ్చారు. ఇట్లు మూడుసార్లు జరిగింది. స్వామివారి వేటను తిలకించడానికి పారువేట మండపానికి వేలాదిగా భక్తులు విచ్చేసారు. శ్రీమలయప్పస్వామివారు ఉత్సవము పూర్తియి మహాద్వారమునకు వచ్చి హత్తీరాంజీవారి బెత్తమును తీసుకొని సన్నిధిలోనికి వేంచేసారు. ఇంతటితో ఎంతో వేడుకగా జరిగే పారువేట ఉత్సవము ఘనంగా ముగిసింది.
ఈ ఉత్సవంలో తి.తి.దే సంయుక్త కార్యనిర్వహణాధికారి (తిరుమల) శ్రీ కె.ఎస్. శ్రీనివాసరాజు, ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ చిన్నంగారి రమణ, అదనపు ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆలయ పేస్‌కార్ శ్రీ కోదండరామారావు, పారుపత్తేదారు శ్రీ దొరస్వామి నాయక్, ఇతర ఉన్నతాధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా మంగళవారం నాడు శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను తి.తి.దే. రద్దు చేసింది.
శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం
పవిత్ర ధనుర్మాసకాలం సోమవారం నాడు ముగియడంతో మంగళవారం నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభమైంది.
గత ఏడాది డిశెంబరు 16 నుండి జనవరి 14 వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానే గోదా తిరుప్పావై పారాయణం జరిగిన విషయం విదితమే. సరిగ్గా నెల రోజుల విరామమనంతరం శ్రీవారి సుప్రభాతసేవ పునః ప్రారంభం కావడం విశేషం.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.