తిరుమలలో ఘనంగా మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ

తిరుమలలో ఘనంగా మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవ

తిరుమల, 19 సెప్టెంబరు 2013 : ఈ ఏడాదిఅక్టోబరు 5 నుండి 13వ తేది వరకు జరుగనున్న వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని గురువారంనాడు పౌర్ణమి పర్వదినాన తిరుమలలో  మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను రా.7 గం||ల నుండి రా. 9 గం||ల నడుమ తి.తి.దే ఘనంగా నిర్వహించింది.

సాధారణంగా ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల మునుపు బ్రహ్మోత్సవాల తరహాలోనే  మాదిరి బ్రహ్మోత్సవ గరుడసేవను నిర్వహించడం ఆనవాయితి. అందులో భాగంగానే గురువారంనాడు తిరుమలలో మాదిరి గరుడసేవను తి.తి.దే ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో లాగానే శ్రీవారి గరుడవాహనం ముందు భజనమండలులు, వివిధ జానపద కళాకారుల బృందాలు తమ కళారీతులను నేత్ర పర్వంగా ప్రదర్శించారు. నాలుగు మాడవీధుల్లోని వివిధ గ్యాలరీలలో నిల్చొని వేలాది మంది భక్తులు పౌర్ణమి గరుడ సేవను ఆనందంగా తిలకించారు. వాహన ముందు భాగంలో వైదిక విద్యార్థులతో వైధిక హారాన్ని ఏర్పాటు చేశారు. ఈ గరుడసేవలో శ్రీవారి సేవకులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ తి.తి.దే భద్రతా సిబ్బంది మరియు పోలీసు పటిష్ట భద్రతా  రక్షణావలయాన్ని కూడా ఏర్పాటు చేసి భక్తులను క్రమబద్ధీకరించారు.

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు తి.తి.దే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.