“దీపాల వెలుగులో గోవిందుని ఆలయం” శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవం

“దీపాల వెలుగులో గోవిందుని ఆలయం”
శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో  కార్తీక దీపోత్సవం 
 
తిరుపతి, 2020 నవంబర్  29: శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆదివారం నాడు కార్తీక దీపోత్సవం మరియు శ్రీ తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర నిర్వహించారు. 
 
ఇందులో భాగంగా ఉదయం స్వామి వారిని సుప్రభాత సేవతో మేలుకొలిపి ఉత్సవ మూర్తులకు కళ్యాణ మండపంలో ఏకాంతంగా  తిరుమంజనము నిర్వహించారు.
 
అనంతరం ఉదయం 8.30 గంటలకు స్వామి అమ్మవార్లను ఆలయ ప్రాంగణంలోని తిరుమంగై ఆళ్వార్ సన్నిధికి వేంచేపు చేసి అక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారికి మరియు శ్రీ తిరుమంగై ఆళ్వార్ కు స్నపన తిరుమంజనము నిర్వహించి, సేవాకాలం శాత్తుమొర ఆస్థానం నిర్వహించారు. 
 
 మద్యాహ్నము 3 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారిని ఒక తిరుచ్చి మీద మరియు శ్రీ తిరుమంగై ఆళ్వార్ ను మరొక తిరుచ్చి మీద వేంచేపు చేసి విమాన ప్రాకార ప్రదక్షిణ గావించి, సేవాకాలం, శాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు.
 
 అనంతరం శ్రీ తిరుమంగై ఆళ్వార్ ను బంగారు వాకిలికి వేంచేపు చేసి మంగళాశాసనాలు నిర్వహించారు.సాయంత్రం 6 గంటలకు పౌర్ణమి సందర్భంగా సన్నిధిలో మూలవర్లకు పూలంగి సేవ తోమాల సేవ నిర్వహించారు. 
 
 సాయంత్రం 6.30 గంటలకు పుండరీకవళ్ళి అమ్మవారి ఆలయం నుంచి పట్టు వస్త్రాలను మరియు దీపాలను శ్రీ చిన్న జియ్యంగార్ స్వామి మరియు ఆలయాధికారులు ప్రదక్షిణగా విమాన ప్రకారం చుట్టూ ప్రదక్షిణగా ఆలయానికి తీసుకెళ్ళి స్వామి వారికి పట్టు వస్త్రాలు  సమర్పించి దీపారాధనలు గావించారు.
 
 ఈ  కార్యక్రమంలో  ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ప్రధాన అర్చకులు శ్రీ ఏపి శ్రీనివాస దీక్షితులు, సూపరింటెండెంట్లు శ్రీ రాజ్ కుమార్, శ్రీ వెంకటాద్రి,  టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు  శ్రీ కృష్ణమూర్తి, శ్రీ మునీంద్ర బాబు, అర్చకులు పాల్గొన్నారు. 
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది