KAISIKA DWADASI ASTHANAM ON NOV 16 _ నవంబరు 16న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి ఆస్థానం
Tirumala, 12 November 2021: Kaisika Dwadasi Asthanam will take place in Tirumala on November 16.
As per Puranic evidences, Kaisika Dwadasi is also known as Prabhodotsavam or Uttana Dwadasi. Every year on the auspicious day of Ashada Shukla Ekadasi, Sri Maha Vishnu goes into celestial sleep Again He wakes up on the auspicious day of Kaisika Dwadasi.
On this day, the processional deity of Sri Ugra Srinivasa Murthy along with Sridevi and Bhudevi will be taken on a procession along four Mada streets during the early hours and returns even before the sunrise.
Later Kaisika Dwadasi Asthanam with Purana parayanam will be performed inside the temple.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
నవంబరు 16న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి ఆస్థానం
తిరుమల, 2021 నవంబరు 12: కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నవంబరు 16వ తేదీన శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం జరుగనుంది. ఈ ఉత్సవ నేపథ్యంలో స్వామివారికి ప్రాతఃకాలంలో నిర్వహించే సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు, తెల్లవారుజామున 4.30 నుండి 5.30 గంటల లోపు తిరుమాడ వీధులలో ఊరేగిస్తారు. అనంతరం ఆలయం లోపల ఉదయం 5.30 నుండి 7 గంటల వరకు కైశికద్వాదశి ఆస్థానాన్ని పురాణపారాయణం ద్వారా ఘనంగా నిర్వహిస్తారు.
పురాణాల ప్రకారం కైశిక ద్వాదశిని ప్రబోధోత్సవం అని, ఉత్తానద్వాదశి అని కూడా వ్యవహరిస్తారు. వివిధ గ్రంథాల్లో పేర్కొన్న విధంగా స్థితికారుడైన శ్రీమహావిష్ణువును మేల్కొల్పే పర్వదినాన్ని కైశికద్వాదశిగా వ్యవహరిస్తారు. శ్రీమహావిష్ణువు ఆషాఢశుక్ల ఏకాదశినాడు గాఢ నిద్రలోకి వెళ్లారు. కైశికద్వాదశినాడు ఆయన్ను మేలుకొల్పడం రివాజు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైవున్న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి మహోత్సవాన్ని ప్రతిఏటా టిటిడి ఘనంగా నిర్వహిస్తుంది.
కైశికద్వాదశి పౌరాణిక నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకుంది. శ్రీనంబదువాన్ అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. తాను ప్రస్తుతం శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని, తప్పక తిరిగివచ్చి క్షుద్బాధను తీరుస్తానని నంబదువాన్ ప్రమాణం చేశాడు. అన్నమాట ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారట. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే పేరు వచ్చింది.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.