నాదనీరాజనం వేదికపై ఆకట్టుకున్న ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు
నాదనీరాజనం వేదికపై ఆకట్టుకున్న ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు
తిరుమల, 2021 అక్టోబరు 12: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుమల నాదనీరాజనం వేదికపై, వసంత మండపంలో ధార్మిక, సంగీత కార్యక్రమాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు మంగళవారం జరిగిన కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.
నాదనీరాజనం వేదికపై …
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం
తిరుపతికి చెందిన భారతీయ విద్యాభవన్ కళాబృందం సభ్యులు ఉదయం 9 నుండి 9.45 గంటల వరకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు.
ఆధ్యాత్మిక ప్రవచనం
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ఆచార్యులు శ్రీ మోహనరంగాచార్యులు ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు శ్రీనివాసుడు – నిత్య కైంకర్య మూర్తి అనే అంశంపై ఉపన్యసించారు.
హరికథ
తిరుపతి ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీ వెంకటేశ్వర్లు భాగవతార్ మధ్యాహ్నం 2 నుండి 3.15 గంటల వరకు హరికథ పారాయణం చేశారు.
అన్నమయ్య సంకీర్తన లహరి
టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు తిరుపతికి చెందిన శ్రీ రఘునాథ్ బృందం మధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు అన్నమయ్య సంకీర్తన లహరి పేరిట పలు అన్నమయ్య సంకీర్తనలను లయబద్ధంగా ఆలపించారు.
వసంత మండపంలో ….
వసంత మండపంలో నిర్వహిస్తున్నవేంకటాచల మహత్యం, వాహనసేవల వైశిష్ట్యంపై ఉపన్యాస కార్యక్రమం మంగళవారం ఏడవ రోజుకు చేరుకుంది.
ఇందులో భాగంగా అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణశర్మ వేంకటాచల మహత్యంపై ఉపన్యసించారు. అనంతరం మంగళవారం రాత్రి శ్రీవారికి జరిగే గజ వాహనం, బుధవారం ఉదయం జరిగే సూర్యప్రభ వాహనసేవల వైశిష్ట్యాన్ని కమనీయంగా వ్యాఖ్యానించారు. చివరగా వేంకటాచల మహత్యంలోని స్తోత్రాలను 12 మంది టిటిడి వేదపండితులు భక్తులచే పారాయణం చేయించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.