పౌరాణిక జ్ఞానాన్ని నేటి తరానికి అందించాలి : ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి

పౌరాణిక జ్ఞానాన్ని నేటి తరానికి అందించాలి : ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి

తిరుపతి, ఫిబ్రవరి 27, 2013: వ్యాస భాగవతంలోని పౌరాణిక జ్ఞానాన్ని నేటి తరానికి అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తితిదే పురాణ ఇతిహాస ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో వ్యాస భాగవతంపై నిర్వహిస్తున్న సదస్సు బుధవారం రెండో రోజుకు చేరుకుంది.
 
ఉదయం జరిగిన సాహితీ సమావేశానికి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పౌరాణిక జ్ఞానాన్ని పెంచుకున్న వారు ఆధ్యాత్మిక దృక్పథంతో తమ జీవితాన్ని సాగించగలరన్నారు. మనిషి జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపేందుకు అవసరమైన అన్ని విషయాలు ఇందులో ఉన్నాయని తెలిపారు. కుటుంబ సభ్యులతో, చుట్టుపక్కల వారితో ఎలా వ్యవహరించాలి, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి అన్న విషయాలను  భాగవతం నుండి నేర్చుకోవచ్చన్నారు.
 
అనంతరం రాజమండ్రికి చెందిన ఆచార్య శలాక రఘునాథశర్మ ”భాగవత వ్యాఖ్యల్లో శ్రీధరీయ ప్రశస్తి”, తిరుపతికి చెందిన ఆచార్య కె.ప్రతాప్‌ ”భాగవతంలోని భక్తితత్వం”, రాజమండ్రికి చెందిన ఆచార్య అనప్పిండి సూర్యనారాయణమూర్తి ”వామన చరిత్ర” అనే అంశాలపై ఉపన్యసించారు. పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్‌ సముద్రాల లక్ష్మణయ్య భాగవతం ప్రచురణకు సంబంధించిన పలు విశేషాలను సభికులతో పంచుకున్నారు. మధ్యాహ్నం జరిగిన సాహితీ సమావేశంలో భాగవతంలోని శ్రీకృష్ణతత్త్వం, నవవిధ భక్తి మార్గాలు అనే అంశాలపై పండితులు ఉపన్యసించారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్‌ మేడసాని మోహన్‌, తితిదే ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ఆచార్య రవ్వా శ్రీహరి, ఇతర పండితులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.