ప్రతి హృదయంలోనూ భాగవతం మెదలాలి : తితిదే జెఈవో 

ప్రతి హృదయంలోనూ భాగవతం మెదలాలి : తితిదే జెఈవో

తిరుపతి, ఫిబ్రవరి 26, 2013: భారత భాగవత రామాయణాలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని, ప్రతి హృదయంలో ఇవి గ్రంథస్తం కావాలని తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. తితిదే పురాణ ఇతిహాస ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం ఉదయం వ్యాస భాగవతంపై మూడు రోజుల సదస్సు ప్రారంభమైంది.
 
ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి ప్రసంగిస్తూ అన్ని గ్రంథాలయాలు, ప్రతి ఇంటిలో రామాయణం, మహాభారతం, భాగవతం వంటి గ్రంథాలు ఉండాలన్న సదాశయంతో తితిదే ప్రచురిస్తోందన్నారు. ఇలాంటి సదస్సులు విద్యార్థులకు, పరిశోధకులకు, పండితులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
 
అనంతరం హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ప్రసంగిస్తూ మహాభారతంలోని యుద్ధసమయంలో ఉన్న పరిస్థితి నేటి సమాజంలో ఉందన్నారు. భాగవతం ద్వారా సమాజానికి భక్తిభావం అందించాలని ఆయన పండితులను కోరారు. తిరుపతి దైవక్షేత్రంగానే గాక సాంస్కృతిక క్షేత్రంగా విలసిల్లుతోందని అన్నారు. పండితులు ఈ నాటి విజ్ఞానాన్ని పురాణాలకు అన్వయించి సంస్కృతికి, భాషకు సేవ చేయలని కోరారు.
 
తితిదే పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్‌ సముద్రాల లక్ష్మణయ్య కీలకోపన్యాసం చేస్తూ భాగవతం వేదసారంగా ప్రసిద్ధమైందన్నారు. భగవద్గీత లక్షణ గ్రంథం కాగా భాగవతం లక్ష్య గ్రంథమని వివరించారు. భగవద్గీతలో సూచనప్రాయంగా చెప్పిన విషయాలను భాగవతంలో విస్తరించి కథలుగా చెప్పారని, వీటి వల్ల విజ్ఞానాన్ని, వైరాగ్యాన్ని పెంచడమే వ్యాసమహర్షి ఉద్దేశమని తెలిపారు.
 
అంతకుముందు జెఈవో జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. అనంతరం అష్టాథ పురాణాలకు తెలుగు వ్యాఖ్యానం రాసిన పండితులను జెఈఓ సన్మానించారు. వీరిలో విశాఖపట్నంకు చెందిన ఆచార్య వేదుల సుబ్రమణ్యశాస్త్రి, హైదరాబాదుకు చెందిన డాక్టర్‌ కె.వి.సుందరాచార్యులు, హిందూపురానికి చెందిన కె.వి.నాగరాజశర్మ, గుంటూరుకు చెందిన ఆచార్య కె.వి.రంగనాయకి, రాజమండ్రికి చెందిన ఆచార్య అనపిండి సూర్యనారాయణమూర్తి, రాజమండ్రికి చెందిన ఆచార్య ఎ.ఎస్‌.పి.మహాలక్ష్మి, హైదరాబాదుకు చెందిన ఆచార్య కె.రామానుజాచార్యులు, హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ఉన్నారు.
 
మధ్యాహ్నం తితిదే ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ఆచార్య రవ్వా శ్రీహరి అధ్యక్షతన మొదటి సమావేశం జరిగింది. ఇందులో హైదరాబాదుకు చెందిన ఆచార్య కె.రామానుజాచార్యులు ”భాగవత వ్యాఖ్యల్లో వీరరాఘవీయ ప్రశస్తి”, రాజమండ్రికి చెందిన ఆచార్య శలాక రఘునాథశర్మ ”భాగవత వ్యాఖ్యల్లో శ్రీధరీయ ప్రశస్తి”, గుంటూరుకు చెందిన ఆచార్య కె.వి.రంగనాయకి ”భాగవత పరమార్థం”, హిందూపురానికి చెందిన ఆచార్య కె.బి.నాగరాజశర్మ ”ప్రహ్లాద చరిత్ర” అనే అంశాలపై ఉపన్యసించారు.
 
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్‌ మేడసాని మోహన్‌, హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, రాజకైంకర్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ గోవిందరాజులు, పండితులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.