ఫిబ్రవరి 17న తిరుమలలో రథసప్తమి 

ఫిబ్రవరి 17న తిరుమలలో రథసప్తమి

తిరుమల, 2 ఫిబ్రవరి 2013: సూర్యజయంతిని పురస్కరించుకొని ఫిబ్రవరి 17వ తారీఖున తిరుమలలో అత్యంత వైభవంగా సాలకట్ల రథసప్తమిని తి.తి.దే నిర్వహించనుంది.
ఈ సందర్భంగా సర్వాలంకారభూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు సప్త వాహనాలపై ఒకేరోజు తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తాడు. సాధారణంగా 9 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలలో స్వామివారు రోజుకు రెండ వాహనాల చొప్పున 16 వాహనాలపై ఊరేగడం ఆనవాయతి. అయితే ఒకేరోజు స్వామివారు 7 వాహనాలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించే రథసప్తమిని శ్రీవారి భక్తులు ఉప బ్రహ్మోత్సవాలుగా కూడా   వ్యవహరిస్తారు. ఈ సందర్బంగా శ్రీ మలయప్పస్వామివారు ఉదయం నుండి రాత్రిలోపు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఊరేగనున్నారు.
 
కాగా ఈ సందర్భంగా తి.తి.దే శ్రీవారి ఆలయంలో ఆరోజు నిర్వహించే ఆర్జితసేవలైన కల్యాణోత్సం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసింది. అయితే సుప్రభాతం, తోమాల మరియు అర్చనలను ఏకాంతంలో నిర్వహిస్తారు.
 
సమయం వాహనం
 
ఉ. 5.30 – ఉ. 08.00 సూర్యప్రభ
ఉ. 9.00 – ఉ. 10.00 చిన్నశేష
ఉ. 11.00 – మ. 12.00 గరుడ
మ. 1.00 – మ. 2.00 హనుమంత
మ. 2.00 – మ. 3.00 చక్రస్నానం
సా. 4.00 – సా. 5.00 కల్పవృక్ష
సా. 6.00 – సా. 7.00 సర్వభూపాల
రా. 8.00 – రా. 9.00 చంద్రప్రభ
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.